News May 16, 2024

బీజేపీకి మళ్లీ అధికారమంటే ఆ వర్గాలకు ద్రోహమే: ఖర్గే

image

బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమంటే దళితులు, గిరిజనులు, పేదలు, రైతులకు ద్రోహం చేసినట్లేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ‘ప్రజలకు ఆహారం, ఉద్యోగాలు దొరకడం లేదు. కానీ ప్రధానికి తన పదవి తప్ప ఇంకేం పట్టవు. సోనియమ్మ తృణప్రాయంగా వదిలేసిన ఆ అధికారంపైనే బీజేపీ వాళ్ల చూపు ఉంది. అలాంటివారిని మళ్లీ అధికారంలోకి తీసుకురాకూడదు’ అని రాయబరేలిలో తేల్చిచెప్పారు.

News May 16, 2024

చైనాకు చేరుకున్న పుతిన్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం చైనాకు చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధంతో పాటు వివిధ అంశాల్లో చైనా మద్దతును కోరుతూ ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇది పుతిన్ చేపట్టిన తొలి పర్యటనే కాక గడచిన 6 నెలల్లో చైనాకు రెండో పర్యటన కావడం గమనార్హం. ఆయన 2రోజుల పాటు పర్యటిస్తారని, ఇరు దేశాల మైత్రిని ఇది మరింత బలోపేతం చేస్తుందని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి.

News May 16, 2024

సీఎం క్యాంప్ ఆఫీస్‌గా లేక్‌వ్యూ గెస్ట్ హౌస్?

image

TG: రాజ్‌భవన్ రోడ్డులోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌ను సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం అయినప్పటి నుంచీ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే రేవంత్ పాలన సాగిస్తున్నారు. సమావేశాలకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండటంతో ‘లేక్‌ వ్యూ’ని వాడాలని ఆయన యోచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జూన్ 2 తర్వాత ఆ భవనాన్ని ఏపీ నుంచి రాష్ట్ర సర్కారు స్వాధీనం చేసుకోనుంది.

News May 16, 2024

భారత్‌లో పట్టణ నిరుద్యోగం తగ్గింది: NSSO

image

భారత పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో(6.8శాతం) పోలిస్తే ఈ ఏడాది అదే కాలవ్యవధికి(6.7శాతం) తగ్గిందని జాతీయ శాంపిల్ సర్వే(NSSO)లో తేలింది. పురుషులు, మహిళల్ని విడిగా చూస్తే.. మహిళల నిరుద్యోగం అప్పుడు 9.2శాతం నుంచి ఈ ఏడాది 8.5శాతానికి దిగిందని పేర్కొంది. పురుషుల విషయంలో మాత్రం అప్పుడు 6శాతం నుంచి ఏడాది 6.1 శాతానికి పెరిగిందని వివరించింది.

News May 16, 2024

ఇక శ్రీలంకలోనూ ఫోన్ పే!

image

యూపీఐ లావాదేవీ సంస్థ ఫోన్ పే శ్రీలంకలో సేవల్ని ప్రారంభించింది. శ్రీలంకలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. అక్కడికి వచ్చే భారతీయులకు ఇది మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని తెలిపింది. శ్రీలంకలోని లంకాపేతో కలిసి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. భారతీయులు వారి ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేయొచ్చని, నగదును వెంటే తీసుకెళ్లనక్కర్లేదని పేర్కొంది.

News May 16, 2024

తెలుగు సంప్రదాయం చాలా ఇష్టం: కాజల్

image

తెలుగు భాష, సంప్రదాయం తనకు చాలా ఇష్టమని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టకపోయినా పెళ్లి కూడా అందుకే తెలుగు పద్ధతిలో చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘నాకు మన సినిమాల్లో చాలా నకిలీ పెళ్లిళ్లు చేసేశారు. దీంతో నిజం పెళ్లి కూడా మన తెలుగు స్టైల్లోనే చేసుకున్నా. ముంబైలో పుట్టినా తెలుగు ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడు నాకు అది సెకండ్ లాంగ్వేజ్’ అని తెలిపారు.

News May 16, 2024

బాల్ థాకరే శివసేనను ముగిస్తాననేవారు: మోదీ

image

ఉద్ధవ్ శివసేనపై ప్రధాని మోదీ తాజాగా విమర్శలు గుప్పించారు. ఈ సేన నకిలీదంటూ ఎద్దేవా చేశారు. ‘నాకు బాలాసాహెబ్ మాటలు గుర్తొస్తున్నాయి. శివసేన కాంగ్రెస్‌లా మారితే దాన్ని ముగిస్తానని ఆయన అనేవారు. అంటే ఇప్పుడున్న నకిలీ శివసేన జాడలు కూడా ఉండేవి కాదు. ఆయన ప్రతి కలను ఈ సేన ముక్కలు చేసింది. ఆఖరికి ఆయన ఎంతగానో ఎదురుచూసిన అయోధ్య రామాలయంపై కాంగ్రెస్ ఇష్టారీతిన మాట్లాడినా సైలెంట్‌గా ఉంది’ అని విమర్శించారు.

News May 16, 2024

బైడెన్‌తో వాగ్వాదానికి నేను రెడీ: ట్రంప్

image

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించేకొద్దీ పోరు మరింత రసకందాయంలో పడుతోంది. తన ప్రత్యర్థి ట్రంప్‌ను టీవీ డిబేట్‌కు రావాలంటూ అధ్యక్షుడు బైడెన్ సవాల్ చేయగా ట్రంప్ అంగీకరించారు. ‘గర్జించేందుకు నేను సిద్ధం. బైడెన్ సవాలును స్వీకరిస్తున్నా. జూన్, సెప్టెంబరులో రెండు చర్చలకు నేను రెడీగా ఉన్నా. చర్చల్లో పాల్గొనే అత్యంత అసమర్థ వ్యక్తి మీరే కావొచ్చు. భారీ వేదికను ఏర్పాటు చేయండి’ అని ట్రంప్ స్పష్టం చేశారు.

News May 16, 2024

కింగ్ ఛార్ల్స్ చిత్రపటంపై విమర్శలు

image

బ్రిటన్ రాజు ఛార్ల్స్‌‌కు చెందిన తాజా చిత్రపటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరడుగుల ఎత్తున్న చిత్రపటాన్ని జొనాధన్ అనే ఆర్టిస్ట్ 3ఏళ్ల పాటు కష్టపడి రూపొందించారు. దీన్ని బ్రిటన్ రాజకుటుంబం నెట్టింట పంచుకోగా స్పందన పూర్తి నెగిటివ్‌గా వచ్చింది. పూర్తి ఎరుపు, ఊదా రంగులతో గీసిన ఆ చిత్రపటం ఏమాత్రం ఆకర్షణీయంగా లేదంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఛార్ల్స్ గత ఏడాది రాజుగా పట్టాభిషిక్తులైన సంగతి తెలిసిందే.

News May 16, 2024

8ఏళ్ల క్రితం కూలిన హోర్డింగ్.. ఇప్పుడు స్పందించిన GHMC!

image

TG: ఎప్పుడో 8ఏళ్ల క్రితం వర్షాల కారణంగా బంజారాహిల్స్‌లో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దానిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ జీహెచ్ఎంసీని ట్విటర్‌లో ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఆ ఫిర్యాదుపై GHMC ఈరోజు స్పందించింది. సంబంధిత బృందాన్ని పంపించి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ తీరు దొంగలు పడిన 6నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.