News May 13, 2024

ముగిసిన పోలింగ్.. 22 రోజులు ఉత్కంఠ

image

AP: రాష్ట్రంలో రెండు నెలలుగా ఎన్నికల పోరు హోరెత్తింది. వైసీపీ- కూటమి(TDP,BJP,JSP) ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. కొందరు ఓటర్లను ప్రలోభపెట్టారు. చివరికి ఇవాళ అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 22 రోజుల తర్వాత.. అంటే జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తేలాలంటే అప్పటివరకు ఆగాల్సిందే. అప్పటివరకు అభ్యర్థులు, వారి అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగనుంది.

News May 13, 2024

ఊహించని ఫలితాలు చూడబోతున్నాం: CBN

image

AP: ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని TDP అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతీ ఒక్కరిలో కనిపించిందని అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే YCP వాళ్లు కుట్రలు పన్నుతూ వచ్చారని, అయితే.. ప్రజాస్వామ్యస్ఫూర్తితో వారి కుట్రలను TDP శ్రేణులు భగ్నం చేశాయని అన్నారు. YCP హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిందని, తాము దీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదని బాబు అన్నారు.

News May 13, 2024

అడ్డగోలుగా అధికారుల బదిలీలు జరిగాయి: సజ్జల

image

AP: రెండు నెలలుగా టీడీపీ అడ్డగోలు రాజకీయం చేసిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘బూతులతో వ్యక్తిగత హక్కుల హననాలకు పాల్పడ్డారు. అధికారం అండగా ఉంటుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పోలింగ్‌కు ముందురోజు కూడా అడ్డగోలుగా అధికారుల బదిలీలు జరిగాయి’ అని సజ్జల విమర్శించారు.

News May 13, 2024

RCB ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే?

image

చెన్నైతో మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 ప‌రుగుల తేడాతో గెలవాలి. అదే ఛేదనలో అయితే 18.1 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్‌ను ముగించాలి. అప్పుడు CSK కంటే RCB ర‌న్‌రేట్ మెరుగవుతుంది. అదే సమయంలో SRH, LSG తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిస్తే బెంగళూరు ఆశలన్నీ గల్లంతై ఇంటి బాట పట్టనుంది.

News May 13, 2024

టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల

image

AP: పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘పల్నాడు జిల్లాలో ఏకపక్షంగా దాడులు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడమే మాకు కావాలి. అందుకే మేం ఎంతో సంయమనంతో ఉన్నాం. ప్రభుత్వం సానుకూలత ఉప్పెనలా కనిపిస్తోంది. పేదల కోసం జగన్ ఎంతో చేశారు. మహిళల ఆశీర్వాదం వైసీపీకే ఉంది’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

News May 13, 2024

హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్

image

మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూరు కోర్టు ష్యూరిటీ కింద రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులకు సహకరించాలని తీర్పులో పేర్కొంది.

News May 13, 2024

రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం: సీఈవో

image

TG: రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్ శాతం తెలుస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. 1400 కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో ఉన్నారు. మొత్తం 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్నాయి. శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు రాలేదు. ఈరోజు 400 ఫిర్యాదులు వచ్చాయి. 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి’ అని వివరించారు.

News May 13, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు రేపు వర్ష సూచన ఉన్నట్లు APSDMA ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

News May 13, 2024

జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన

image

ఎన్నికలను కవర్ చేస్తోన్న జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతోపాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని గిల్డ్ అన్ని రాజకీయ పార్టీలు, కార్యకర్తలను కోరింది.

News May 13, 2024

రాత్రి పది వరకూ పోలింగ్!

image

AP: పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్నవారు ఓటు వేయవచ్చు. అయితే, రాష్ట్రంలోని పలు కేంద్రాల వద్ద క్యూలో ఓటర్లు భారీగా ఉండటంతో రాత్రి పది వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.