News May 9, 2024

నేడూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News May 9, 2024

నేనూ కేసీఆర్ బాధితుడినే: ప్రభాకర్ రావు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ OSD ప్రభాకర్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. తాను కూడా KCR బాధితుడినేనని చెప్పారు. గతంలో నల్గొండ ఎస్పీగా తప్పించారని, ఐజీగా పదోన్నతి కల్పించడంలోనూ 5 నెలలు ఆలస్యం చేశారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు చెప్పిన ప్రభాకర్ రావు.. జూన్ 26న రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు.

News May 9, 2024

వైసీపీ నేతలు దొంగ నోట్లు తయారు చేస్తున్నారు: పట్టాభి

image

వైసీపీ నేతలు దొంగ నోట్లు తయారు చేస్తున్నారని TDP నేత పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.500 దొంగ నోట్లు మార్చుతూ వైసీపీ నేతలు పట్టుబడినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయని చెప్పారు. సీఎం సొంత జిల్లా కడప, అనంతపురం జిల్లాల్లో వీటిని తయారు చేస్తున్నారని తెలిపారు. నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ పరిశ్రమలు సైతం పెట్టారన్నారు. ఎన్నికల వేళ వైసీపీ నేతలు ఇచ్చే డబ్బు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.

News May 9, 2024

BRS అందుకే ఓడిపోయింది: జగన్

image

AP: గత పదేళ్లలో తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమాన్ని BRS ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైందని CM జగన్ అన్నారు. BRS కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం AP ప్రజల ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. విలువలు, విశ్వసనీయతకు ఓటేస్తారా? అబద్ధాలకు ఓటేస్తారా? అనేది వారే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

News May 9, 2024

TS EAPCET: ఈనెల 11న ప్రైమరీ కీ విడుదల

image

TG: EAPCET అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిన్నటితో ముగియగా, ఈనెల 11న ప్రైమరీ ‘కీ’ని రిలీజ్ చేయనున్నట్లు కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. అదే రోజు రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రం కూడా విడుదల చేస్తామన్నారు. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 13న ఉ.11లోగా తెలపాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి.

News May 9, 2024

దేశంలో హిందూ జనాభా తగ్గుముఖం

image

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని PM ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. 1950-2015 మధ్య 7.8% హిందువులు తగ్గినట్లు పేర్కొంది. 1950లో 84% ఉన్న హిందువులు 2015 నాటికి 78 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో మైనార్టీల జనాభా పెరిగినట్లు తెలిపింది. 1950-2015 మధ్య ముస్లిం జనాభా 43.15%, క్రిస్టియన్లు 5.38% పెరిగారని చెప్పింది. హిందూ జనాభా తగ్గడం, ముస్లిం జనాభా పెరగడానికి కారణాలు తెలియదని పేర్కొంది.

News May 9, 2024

ఔరా.. ఏమా వీర విధ్వంసం..!

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోరు చూసి ప్రత్యర్థి బౌలర్లు గజగజ వణికిపోతున్నారు. వారి వీర విధ్వంసం ముందు చేష్టలుడిగిపోతున్నారు. లక్నోతో మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేశారు. కేవలం 47 నిమిషాల్లోనే పని కానిచ్చేశారు. విధ్వంసక బ్రదర్స్‌గా పేరున్న హెడ్-అభిషేక్ కలిసి ఈ సీజన్‌లో 934 రన్స్ బాదేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్ 200కుపైనే ఉండడం విశేషం.

News May 9, 2024

ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్తున్నారా?

image

ఆస్ట్రేలియాలో ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. వీసా కోసం అప్లై చేసుకునే విదేశీ విద్యార్థుల మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.16.35 లక్షల(29,710 ఆస్ట్రేలియన్ డాలర్లు)కు పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 10 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అక్కడ ఏడాది నివాసానికి అయ్యే ఖర్చుల మొత్తాన్ని తమ అకౌంట్లో ఉన్నట్లు చూపెట్టాల్సి ఉంటుంది.

News May 9, 2024

రూ.20వేలకు మించి నగదు ఇవ్వరాదు: RBI

image

నగదు రూపంలో రూ.20వేలకు మించి ఎవరికీ రుణాలను ఇవ్వరాదని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (నాన్‌బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. IT చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఈ నిబంధనను తప్పక అమలు చేయాలని సూచించింది. డిజిటలైజేషన్‌ను మరింత ప్రోత్సహించేందుకు, నగదు చలామణి కట్టడికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News May 9, 2024

ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.