News August 16, 2024

డ్రగ్స్‌తో పట్టుబడితే అడ్మిషన్ రద్దు?

image

TG: కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లరని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ నివారణపై డీజీపీ, విద్యాశాఖాధికారులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రేపు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News August 16, 2024

వరలక్ష్మీ వ్రతం.. ఈ తప్పులు అస్సలు చేయవద్దు!

image

ఈరోజు వరలక్ష్మీ వ్రతం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎంతో ఏకాగ్రత అవసరం. కలశాన్ని ఏర్పాటు చేసుకున్నవారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదు. వెండి లేదా రాగి ప్లేట్లు వాడుకోవచ్చు. గణపతి పూజ చేశాకే లక్ష్మీపూజ చెయ్యాలి. ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టవద్దు. వాట్సాప్ స్టేటస్‌ల కోసం వ్రతం చేస్తే ముక్తి ఉండదని పెద్దలంటున్నారు.

News August 16, 2024

పొలానికి దారి లేదా.. ఇలా చేయండి

image

AP: పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే. లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయొచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు.

News August 16, 2024

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. రెండు రోజుల్లో భారీ వర్షాలు

image

AP: రాష్ట్ర ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో గాలిలో తేమశాతం పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల విపరీతంగా చెమటలు, ఎక్కువ దాహం వేస్తుందంటున్నారు. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మన్యం, అల్లూరి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాలపై ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.

News August 16, 2024

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 16, 2024

భారీగా పెరిగిన పూల ధరలు

image

AP: శ్రావణ మాసంలో వరుస శుభాకార్యాలు, వరలక్ష్మీ వ్రతం కారణంగా పూల ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమూ ప్రభావం చూపుతోంది. గత నెలలో మల్లెల ధర KG ₹550 ఉండగా ఇప్పుడు ₹1,500 పలుకుతోంది. తెల్ల చామంతి ₹200 నుంచి ₹350, పసుపు చామంతి ₹150 నుంచి ₹400, కనకాంబరం ₹100 నుంచి ₹300, లిల్లీ ₹150 నుంచి ₹500, జాజులు ₹300 నుంచి ₹1,200కు చేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News August 16, 2024

వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి!

image

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలు, భక్తి, ఏకాగ్రతతో జరుపుకోవాలి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం. ఈరోజు వీలుకాకపోతే ఏ శుక్రవారమైనా వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయని, పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుందని నమ్మకం.

News August 16, 2024

రోడ్ల నిర్మాణం తర్వాతే భవనాల పనులు: ప్రభుత్వం

image

AP: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో చేపట్టే పనుల్లో గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, మురుగు కాలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాతే అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్లకు సూచించింది. గత ప్రభుత్వం 35వేలకు పైగా భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. ఇందులో 80 శాతం లోపు పనులు పూర్తయిన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టనుంది.

News August 16, 2024

రాష్ట్రంలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, జనగామ, భువనగిరి, RR, HYD, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 16, 2024

GAZA: శవాలు పూడ్చటానికీ చోటు లేదు!

image

గాజా యుద్ధంలో మృతుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. 10 నెలల్లో 40,005 మంది పాలస్తీనా ప్రజలతోపాటు మిలిటెంట్లు మరణించారు. గాజాలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చటానికి స్థలం కూడా దొరకటం లేదు. సమాధిపైనే మరో సమాధి నిర్మించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని మృతదేహాలను పార్కులు, ఇంటి మెట్ల కింద పూడ్చిపెడుతున్నారు. బతికున్నవారు కూడా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చావు కోసం ఎదురుచూస్తున్నారని రచయిత యూస్రీ అన్నారు.