News March 30, 2024

నేటి నుంచి పవన్ ప్రచారం

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ‘వారాహి విజయభేరి యాత్ర’ పేరిట ప్రచారం చేయనున్నారు.

News March 30, 2024

ఏప్రిల్ 2 వరకు వడగాలులు!

image

TG: భానుడి భగభగలతో రాష్ట్రం మండిపోతోంది. పగటిపూట బయటికి రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ వడగాలుల తీవ్రత ఏప్రిల్ 2 వరకు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

News March 30, 2024

IPL: నేడు లక్నో-పంజాబ్ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఎల్ఎస్‌జీ, పంజాబ్ కింగ్స్ లక్నోలో తలపడనున్నాయి. గత ఏడాది ఈ రెండూ పంజాబ్‌లో మ్యాచ్ ఆడాయి. లక్నో 257 పరుగులు చేయగా.. పంజాబ్ 201 రన్స్ చేసి ఓడింది. లక్నో పిచ్ మందకొడిగా ఉండటంతో ఈరోజు మ్యాచ్‌లో ఆ స్థాయిలో పరుగులు రాకపోవచ్చంటున్నారు క్రీడా విశ్లేషకులు. ప్రస్తుతం పంజాబ్ 2 మ్యాచులాడి ఒక విజయాన్ని సాధించగా.. లక్నో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.

News March 30, 2024

రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్‌కు విద్యుత్ సంక్షోభం

image

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌పై విద్యుత్ సంక్షోభపు కత్తి వేలాడుతోంది. ఆ దేశ విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా మాస్కో దాడులు చేస్తోంది. పలు చోట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల కరెంటు కోతలు చేపట్టామని, మున్ముందు ఇది మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఇంధన ఉగ్రవాదమేనంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2024

మే మొదటివారం రాష్ట్రానికి పీఎం మోదీ

image

TG: ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.

News March 30, 2024

రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం

image

హైదరాబాద్‌ పరిధిలో నిన్న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరిగింది. నిన్న ఒకరోజే 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను ప్రజలు వాడారని విద్యుత్ అధికారులు తెలిపారు. గత ఏడాది మే నెలలో సుమారు ఈ స్థాయిలోనే వినియోగం జరగగా.. ఈసారి మార్చికే రికార్డు రావడం గమనార్హం. ఈ సీజన్‌లో వినియోగం 90 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎండలు, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలే దీనికి కారణం కావొచ్చంటున్నారు.

News March 30, 2024

కోహ్లీ ఆటతీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు

image

నిన్న రాత్రి బెంగళూరులో జరిగిన RCB, KKR మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆయన విమర్శకులు విరుచుకుపడుతున్నారు. సుమారు 10 ఓవర్లు ఆడిన విరాట్, కేవలం 83 పరుగులే చేయడమేంటంటూ మండిపడుతున్నారు. దీంతో ‘140 స్ట్రైక్ రేట్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. 183 రన్స్ టార్గెట్‌ను 17వ ఓవర్లోనే కేకేఆర్ ఛేదించింది. తోటి ఆటగాళ్ల నుంచి సాయం లేకపోవడంతోనే విరాట్ అలా ఆడారంటూ ఫ్యాన్స్ కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు.

News March 30, 2024

వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ నేటి షెడ్యూల్

image

AP: నిన్న రాత్రి పత్తికొండలో బస చేసిన సీఎం జగన్, ఈరోజు ఉదయం అక్కడి నుంచి బయలుదేరతారు. రాతన మీదుగా తుగ్గలికి చేరుకుని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి జొన్నగిరి మీదుగా గుత్తికి చేరుకుని భోజనం చేస్తారు. మూడింటి వరకు విరామం అనంతరం పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ మీదుగా సంజీవపురం శివారు వరకు యాత్రలో పాల్గొంటారు. రాత్రికి సంజీవపురం వద్దే బస చేస్తారు.

News March 30, 2024

ఎట్టకేలకు జపాన్‌లో ‘ఒపన్‌హైమర్’ విడుదల!

image

ఆస్కార్ గెలిచిన ‘ఒపన్‌హైమర్’ సినిమా ఎట్టకేలకు జపాన్‌లో విడుదలైంది. రాబర్ట్ ఒపన్‌హైమర్ తయారుచేసిన అణ్వాయుధాల కారణంగా 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు నాశనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అమెరికాలో గత జులైలోనే విడుదలైన ఆ సినిమాను జపాన్‌లో ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే తాజాగా ధైర్యం చేసి సినిమాను విడుదల చేశామని మేకర్లు ప్రకటించారు.

News March 30, 2024

మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై ముయిజ్జు తీవ్ర ఆగ్రహం

image

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌పై ప్రత్యక్షంగా, భారత్‌పై పరోక్షంగా ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఇబ్రహీం అధికారంలో ఉన్న సమయంలో వారికి పార్లమెంటులో అత్యధిక మెజారిటీ ఉంది. కానీ దేశ స్వతంత్రతను కాపాడటంతో విఫలమయ్యారు. భద్రతను విదేశీ పాలకుల చేతిలో పెట్టారు. ఆ రాయబారుల ఆదేశాలకు అనుగుణంగా పాలించారు. దానివల్ల కోలుకోలేని విధ్వంసం జరిగింది’ అని మండిపడ్డారు.