News February 12, 2025
సిక్కుల ఊచకోత: కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.
Similar News
News March 22, 2025
రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నిన్న రాష్ట్రంలో ఎండలు మండిపోయాయి. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు నమోదయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో వడగాలులు వీచాయి.
News March 22, 2025
వ్యోమగాములకు నా సొంత డబ్బు చెల్లిస్తా: ట్రంప్

8రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్ 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ అదనపు కాలానికి వారిద్దరికీ రోజుకు చెరో 5 డాలర్ల చొప్పున 286 రోజులకు 1430 డాలర్ల వేతనాన్ని నాసా ఇవ్వకపోవడంపై ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయం తనకు తెలియదని తెలిపారు. అవసరమైతే తన సొంత డబ్బునే వారికి జీతాలుగా ఇస్తానని స్పష్టం చేశారు.
News March 22, 2025
నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.