News April 14, 2024

ఆఫీసుకు రావాలని క్యాన్సర్ బాధితురాలికి లేఖ!

image

స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను ఆఫీసుకు రమ్మని ఆమె పనిచేసే కంపెనీ బాస్ లేఖ రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు ఎంత ఫిట్‌గా ఉందో తెలుసుకునేందుకు వైద్యుల నుంచి లేఖ తేవాలని ఆమె కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఓ మహిళ అయ్యి ఉండి తోటి మహిళతో ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్ బాధితురాలనే కనికరం లేకుండా ఆఫీసుకు రమ్మనడం సరికాదని మండిపతున్నారు.

News April 14, 2024

ఈనెల 24 నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఈనెల 24 నుంచి న్యాయ విచారణ ప్రారంభంకానుంది. నాలుగు రోజుల పాటు విచారణ జరగనుందని సమాచారం. ఈనెల 25న మేడిగడ్డ ప్రాజెక్టును జస్టిస్ ఘోష్ సందర్శించనున్నారు. విచారణలో పలువురికి సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కమిషన్.. న్యాయవాదులు, బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది, నిపుణులను నియమించుకోనుంది.

News April 14, 2024

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ.. అక్కసు వెళ్లగక్కిన చైనా

image

తమను కాదని విదేశీ సంస్థలు భారత్‌వైపు మొగ్గుచూపడంపై చైనా అక్కసువెళ్లగక్కింది. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఆసక్తి కనబర్చడాన్ని డ్రాగన్ తప్పుపట్టింది. ‘భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ స్థాపిస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు. స్థిరత్వం లేని, ఇంకా పూర్తిగా వృద్ధి చెందని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం తొందరపాటు చర్య అవుతుంది’ అని చైనా అధికారిక పత్రిక ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

News April 14, 2024

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు షురూ

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో పొరుగు దేశాలైన ఇరాక్, జోర్డాన్ అప్రమత్తమయ్యాయి. ఇరాక్ ఇప్పటికే తమ గగనతలాన్ని క్లోజ్ చేయగా, ఏదైనా ఇరాన్ విమానం తమ గగనతలంలోకి ప్రవేశిస్తే కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. సిరియాలోని తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌ దాడికి దిగుతామని ఇటీవల ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

News April 14, 2024

తొలి విడతలో వీళ్లే రిచ్!

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఛింద్వాడాలో గెలిచి ఇప్పుడు మరోసారి పోటీకి దిగిన నకుల్ సంపద రూ.716కోట్లు అని ADR వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో రూ.662కోట్లతో AIADMK నేత అశోక్ కుమార్, రూ.206 కోట్లతో BJP నేత మాల రాజ్యలక్ష్మీ షా, రూ.159కోట్లతో BSP అభ్యర్థి మజీద్ అలీ ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

News April 14, 2024

ఐదేళ్లలో 30 రెట్లు పెరిగిన సంపద.. ఎంపీ ఏమన్నారంటే?

image

బెంగళూరు సౌత్ నుంచి మరోసారి బరిలో నిలిచిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సంపద భారీగా పెరగడం చర్చనీయాంశమైంది. 2019లో రూ.13.46లక్షలుగా ఉన్న ఆయన సంపద ఐదేళ్లలో 30రెట్లు పెరిగి రూ.4.10కోట్లకు చేరింది. అయితే ఇందుకు కారణం స్టాక్ మార్కెట్లేనని సూర్య చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు కొనసాగిస్తున్నానని, ఇవే తన సంపద పెరిగేలా చేశాయన్నారు.

News April 14, 2024

IMF ఎండీగా మరోసారి క్రిస్టాలినా

image

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి క్రిస్టాలినా జార్జివా ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ఐదేళ్ల పాటు ఎండీగా రెండో టర్మ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడుదొడుకులను దీటుగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ బోర్డు క్రిస్టాలినాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా మరోసారి IMF MD బాధ్యతలు అందుకోవడంపై క్రిస్టాలినా హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2024

రెండు సార్లు ఆరు బంతులకు ఆరు సిక్సర్లు!

image

ఖతర్‌తో T20లో ఓవర్‌లో 6 <<13046401>>సిక్సర్లు<<>> బాదిన దీపేంద్ర సింగ్(నేపాల్) పేరు నెట్టింట మారుమోగుతోంది. అతను 2023లో మంగోలియాతో మ్యాచ్‌లోనూ వరుసగా తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టారు. అయితే అది రెండు ఓవర్ల మధ్య జరిగింది. 18వ ఓవర్ చివరి 5 బంతులకు దీపేంద్ర సిక్సులు కొట్టారు. 19వ ఓవర్ మొదటి బంతికి కుశాల్ సింగిల్ తీయగా, రెండో బంతికి దీపేంద్ర మళ్లీ సిక్సర్ బాదారు.

News April 14, 2024

సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్

image

AP: నేడు కొనసాగాల్సిన మేమంతా సిద్ధం యాత్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విరామం ప్రకటించారు. గాయం తగ్గేవరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను నేడు వైసీపీ వెల్లడించనుంది. ప్రస్తుతం జగన్ కేసరపల్లి క్యాంప్‌లో బస చేస్తున్నారు. మరోవైపు జగన్‌పై దాడి ఘటనపై నివేదిక పంపాలని సీపీని ఈసీ ఆదేశించింది.

News April 14, 2024

ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

image

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జననం
1950: భారత్ తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి