Chittoor

News August 9, 2025

నెలాఖరున కుప్పం రానున్న సీఎం?

image

సీఎం చంద్రబాబు ఈ నెలాఖరున కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సమాచారం. హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేసేందుకు సీఎం 29 లేదా 30 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆగస్టు నెలాఖరికల్లా కుప్పానికి హంద్రీనీవా నీళ్లు విడుదల చేస్తామని ఇది వరకే సీఎం పేర్కొన్న నేపథ్యంలో హంద్రీనీవా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News August 9, 2025

చిత్తూరు: పోలింగ్ అధికారుల వేతనాలు పెంపు

image

చిత్తూరు జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది వేతనాలు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్, సీపీఎస్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, డిప్యూటీ డీఈవో, సెక్టార్ అధికారుల వేతనాలు పెంచారు. గతంలో ప్రిసైడింగ్ అధికారులకు రూ.350 ఇస్తుండగా ప్రస్తుతం రూ.500, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లకు రూ.250 నుంచి రూ.400, కౌంటింగ్ అసిస్టెంట్లకు రూ.450కు పెంచారు.

News August 9, 2025

చిత్తూరు జిల్లాలో నేడు పవర్ కట్

image

మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు నగరం, చిత్తూరు రూరల్స్, గుడిపాల, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, తవణంపల్లె ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

News August 9, 2025

చౌడేపల్లి: రెండేళ్లకే ముగిసిన జీవితం.!

image

కాలువలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పగడాలవారిపల్లెలోని ఓ కోళ్ల ఫామ్‌లో ఒడిశాకు చెందిన మహేశ్ దంపతులు పనిచేస్తున్నారు. అక్కడ పైప్‌లైన్ కోసం కాలువ తీశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు అందులో చేరింది. మహేశ్ కుమారుడు మంజు (2) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. పుంగనూరు ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News August 9, 2025

కార్వేటి నగరంలో అంగరంగ వైభవంగా తెప్పోత్సవం

image

కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి వారి తెప్పోత్సవం మూడవ రోజు టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి పురవీధుల్లో భక్తులకు దర్శనం కల్పించారు. చివరి రోజు వేణుగోపాలస్వామి తెప్పోత్సవం వీక్షించడానికి కోనేరు వద్దకు భక్తులు భారీ ఎత్తున విచ్చేశారు.

News August 8, 2025

చౌడేపల్లి: ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్

image

చౌడేపల్లి మండలంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానం ధర్మకర్తలి మండలి నియామకానికి దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 27 లోపు దేవస్థాన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈనెల 7న నోటిఫికేషన్ జారీ చేశారని దరఖాస్తుకు 20 రోజుల గడువు విధించారని ఆయన చెప్పారు.

News August 8, 2025

సచివాలయ ఉద్యోగిపై చీటింగ్ కేసు నమోదు

image

సచివాలయ ఉద్యోగి సంజీవ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పుంగనూరు SI వెంకటరమణ తెలిపారు. కొండందొడ్డి గ్రామానికి చెందిన ఓ రైతుకు రామకుప్పం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంజీవ్ ట్రాక్టర్ ఇప్పిస్తానంటూ రూ.4.60 లక్షలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ ఇప్పించమని అడగగా ఆయన ముఖం చాటేయడంతో మోసిపోయానని గ్రహించిన రైతు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News August 8, 2025

చిత్తూరు: నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

image

వెదురుకుప్పానికి చెందిన లోకేశ్‌కు పోక్సో కోర్ట్ 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.9,500 జరిమానా విధించింది. నిందితుడు 2022లో 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2022 ఫిబ్రవరి 4న తిరుపతి DSP మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో గురువారం వాదనల అనంతరం జడ్జ్ నిందితుడికి శిక్ష విధించారు.

News August 7, 2025

కుప్పం: మామను చంపిన అల్లుడు అరెస్ట్

image

కుప్పంలోని చిత్తూరు కన్నన్ లే అవుట్ లో మంగళవారం రామదాసు అనే వ్యక్తిని రాయితో కొట్టి చంపిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. తన భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో అల్లుడు రాజ్ కుమార్, అతని స్నేహితుడు గొవిందరాజులుతో కలిసి మామ రాముదాసును హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామని సీఐ స్పష్టం చేశారు.

News August 7, 2025

స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం కావాలి: కలెక్టర్

image

ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వేడుకల నిర్వహణపై గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులకు కేటాయించిన విధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్ఓ మోహన్ కుమార్, డీఎఫ్ఓ ధరణి తదితరులు పాల్గొన్నారు.