Chittoor

News December 14, 2024

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

image

శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్‌టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 14, 2024

నగరి: విద్యుత్ సిబ్బంది సాహసం.. బోటులో వెళ్లి మరమ్మతులు

image

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గూళూరు చెరువు పూర్తిగా నీటితో నిండింది. దీంతో వడమాల పేట మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సిబ్బంది నిండుకుండలా మారిన గూళూరు చెరువులోకి బోటులో వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. ప్రాణాలకు తెగించి వారు చూపిన తెగువను పలువురు అభినందించారు. 

News December 14, 2024

తిరుపతిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

image

తన ప్రేమ విషయం ఎక్కడా తండ్రికి తెలుస్తుందో అన్న భయంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రొంపిచెర్ల మండలానికి చెందిన ఓ అమ్మాయి తిరుపతిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతోంది. అక్కడే అన్నతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది. ఆమె తోటి విద్యార్థిని ప్రేమించింది. ఈ విషయం ఆమె అన్నకు తెలియడంతో ఎక్కడ తండ్రికి చెబుతాడోమోనని భయపడి ఇంట్లోనే ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 14, 2024

జమ్మూ కశ్మీర్‌లో కుప్పం జవాన్ మృతి

image

కుప్పం మండలానికి చెందిన ఓ జవాన్ జమ్మూ కశ్మీరులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములకలపల్లెకు చెందిన మునియప్ప కుమారుడు పొన్నుస్వామి రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. జమ్మూలో విధులు నిర్వహిస్తున్నఆయన రెండు రోజులు అనారోగ్యం పాలయ్యాడు.  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వారు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సొంత గ్రామంలో జరగనున్నాయి.   

News December 14, 2024

తిరుపతి: రెవెన్యూ సదస్సులో 593 ఫిర్యాదులు

image

తిరుపతి జిల్లాలో శుక్రవారం 43 ప్రాంతాలలో రెవెన్యూ సదస్సులు జరిగాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందులో సమస్యలపై 593 ఫిర్యాదులు అధికారులకు అందాయని ఆయన చెప్పారు. ఏడు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించినట్టు పేర్కొన్నారు. మిగిలిన వాటిని నిర్దేశించిన సమయంలో అధికారులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

News December 13, 2024

CGHS వెల్ నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించాలి: తిరుపతి ఎంపీ

image

తిరుపతిలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ తక్షణమే ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి పార్లమెంటులో కోరారు. దాని ప్రారంభానికి నిర్ణయం ప్రకటించి సంవత్సరం కావస్తున్నా.. నియామక అనుమతుల జాప్యంతో ఇంతవరకు ప్రారంభం కాలేదని  చెప్పారు. సెంటర్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలు పొందటంలో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

News December 13, 2024

చిత్తూరు రైతులకు ఇది తెలుసా?

image

మామిడి పంటకు ఇన్సూరెన్స్ ఉంటుందని చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు? ఎకరాకు రూ.1750 ప్రీమియం చెల్లిస్తే.. ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. డిసెంబర్ 15 నుంచి మే 31 మధ్యలో గాలులు, అకాల వర్షాలు, ఉష్ణోగ్రతలో మార్పులతో పంటకు నష్టం జరిగితే పరిహారం వస్తుంది. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో 15వ తేదీలోగా మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలి.

News December 13, 2024

చిత్తూరు జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నామని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ప్రకటించారు. ప్రతి ఒక్క స్కూల్ ఈ నింబధన పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు నిన్ననే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 12, 2024

సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

image

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో సెలవుపై ఇప్పటికీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

News December 12, 2024

మదనపల్లె: రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు

image

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని మండలాలకు మాత్రమే వర్తిస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.