EastGodavari

News August 17, 2024

తూ.గో.: సముద్రంలోకి నీటి విడుదల

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,96,143 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరిందన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు.

News August 17, 2024

నేడు కాకినాడలో జాబ్‌మేళా

image

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం (నేడు) జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నవోదయ టెక్నిక్స్, ఎస్బీ ఇన్సూరెన్స్, సంగీత మొబైల్స్ సంస్థలు 100 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. పదవ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు హాజరుకావచ్చని తెలిపారు.

News August 16, 2024

గోదావరిలో మునిగిన యువకుడు.. రక్షించిన స్థానికులు

image

పామర్రు మండలం కోటిపల్లి వద్ద గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరు గల్లంతైన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కందుల నరేంద్ర, కంచిమర్తి అంజి ద్రాక్షారామం నుంచి కోటిపల్లి గోదావరికి స్నానానికి వెళ్లారు. పుష్కర్ ఘాట్ వద్ద స్నానం ఆచరిస్తూ నరేంద్ర గోదావరిలో మునిగిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు ప్రమాదంలో ఉన్న అంజిని కాపాడారు.

News August 16, 2024

కాకినాడ: రోడ్డు ప్రమాదంలో ANM మృతి

image

కాకినాడ జిల్లా సామర్లకోట ఏడీబీ రహదారిలో స్కూటీపై వెళుతున్న ఓ మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన మహిళ చికిత్స పొందుతూ సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మృతి చెందింది. సదరు మహిళ సామర్లకోట మండలంలోని ఉండూరు గ్రామానికి చెందిన ANM నాగ సత్యవేణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 16, 2024

సహజీవనం.. గంజాయి తాగాలని వేధించినందుకు హత్య

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మసీదు రోడ్డుకు చెందిన నోయల్ జార్జ్‌ను హత్య చేసిన కేసులో నిందితులు ప్రసాద్, ప్రశాంతి, ప్రేమ్ కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు రాజోలు CI గోవిందరాజు, మలికిపురం SI సురేష్ తెలిపారు. గుడిమెల్లంకకు చెందిన ప్రశాంతి నోయల్ జార్జ్‌తో సహజీవనం చేసేది. జార్జ్ మందు, సిగరెట్, గంజాయికి బానిసై, ప్రశాంతిని కూడా తాగమని వేధించడంతో పథకం ప్రకారం అతడిని హత్య చేసినట్లు వివరించారు.

News August 16, 2024

కాకినాడలో రేపు వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం కాకినాడలో వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ, ఐడీఏ, జీడీఏ సభ్యులు ప్రకటించారు. కాకినాడలోని ఐఎంఎ హాలు వద్ద ఐడీఎ, ఐఎమ్‌ఎ, జీడీఏ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. వైద్య సిబ్బందికి కేంద్రం రక్షణ చట్టం చేయాలని, ఆంధ్రప్రదేశ్‌ వైద్య సిబ్బందికి రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని కోరారు. న్యాయం కోసం డిమాండ్‌ చేశారు.

News August 16, 2024

కాకినాడ మాజీ MLA ద్వారంపూడిపై ఫిర్యాదు

image

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్పీ విక్రాంత్ పటేల్‌కు ద్వారంపూడిపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడలో దౌర్జన్యం, దాడులు చేశారని తెలిపారు.

News August 16, 2024

చీడపీడలను గుర్తించే యాప్ ఆవిష్కరణ.. సభ్యుడిగా తూ.గో. జిల్లా వాసి

image

పంటలను ఆశిస్తున్న చీడపీడలను గుర్తించి వాటి నివారణకు సలహాలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, DPPQS, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టం (NPSS) యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాప్‌ను అభివృద్ధి చేసిన బృందంలో సీతానగరం మండలం కాటవరానికి చెందిన వేణుబాబు సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఢిల్లీలోని DPPQS కార్యాలయంలో అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు.

News August 16, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో 28 మంది ఎంపీడీవోల బదిలీ

image

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాల నుంచి బదిలీపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన 28 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీరామచంద్ర మూర్తి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 14 మందిని విశాఖపట్నం జిల్లాకు బదిలీ చేశారు. మరో 14 మందిని పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వారి స్థానంలో ఏవో లేదా ఈవోపీఆర్డీలను ఇన్‌ఛార్జిలుగా నియమించారు.

News August 16, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2.19 లక్షల క్యూసెక్కుల జలాలు

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గురువారం 2.19 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 12,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.20 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.