Visakhapatnam

News August 18, 2024

విశాఖ: సోమవారం నుంచి యథావిధిగా వినతుల స్వీకరణ

image

కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి కలెక్టరేట్ మీటింగ్ హాలులో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 17, 2024

సుప్రీంకోర్టు జడ్జిని కలిసిన రెండు జిల్లాల కలెక్టర్లు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరిని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణణ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల స్థితిగతులను గురించి జడ్జికి వివరించారు.

News August 17, 2024

విశాఖ: ముగ్గురు పర్యాటకులను కాపాడిన లైఫ్ గార్డ్స్

image

విశాఖలోని రుషికొండ బీచ్‌లో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన 20 మంది శనివారం రిషికొండ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో దీపక్ (15), నితిన్ (15), కౌశిక్ (18) సముద్రంలో కొట్టుకుపోతుండగా లైఫ్ గార్డులు సతీష్, రాజు గమనించారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

News August 17, 2024

విశాఖ: బీజేపీలో చేరిన వైసీపీ రాష్ట్ర మహిళా నేత

image

వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగలపాటి యువశ్రీ బీజేపీలో చేరారు. శనివారం విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ కన్వీనర్ నరసింగరావు ఆధ్వర్యంలో చేరిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వివరించారు.

News August 17, 2024

అరకు: గిరిజన సాంప్రదాయంలో సుప్రీంకోర్టు జడ్జి వివాహం

image

అరకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. శనివారం జస్టిస్ దంపతులు అరకులో పర్యటించారు. వారికి జేసీ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఘన స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ దంపతులు ట్రైబల్ మ్యూజియం సందర్శించారు. అక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను తిలకించారు. ఆపై గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

News August 17, 2024

3వేల మందితో ఉత్తరాంధ్ర జానపద జాతర

image

విశాఖ నగరం గురజాడ కళాక్షేత్రంలో ఈనెల 22వ తేదీన 3వేల మంది కళాకారులతో ఉత్తరాంధ్ర జాతర నిర్వహించనున్నట్లు రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ రమణమూర్తి తెలిపారు. ఉత్తరాంధ్ర కళలకు సంబంధించి జాలారి నృత్యం, తప్పెట గుళ్లు, పులి వేషాలు, కర్రసాము, తదితర ప్రదర్శనలు నిర్వహించనున్నట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు.

News August 17, 2024

ప్రిన్స్ వరల్డ్‌గా విశాఖ బాలుడు

image

థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో అంతర్జాతీయస్థాయి మోడలింగ్ పోటీలు నిర్వహించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విశాఖ బాలుడు కార్తికేయ రెడ్డి సత్తా చాటాడు. ప్రిన్స్ వరల్డ్-2024 టైటిల్ కైవసం చేసుకున్నాడు. గతంలోనూ కాలికట్‌లో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం.

News August 17, 2024

సింహాద్రి అప్పన్న సుప్రభాత సేవ ప్రారంభం

image

సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం సుప్రభాత సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌కు ముందు స్వామివారికి కొన్ని సేవలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఆ సేవలను పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం సుప్రభాత సేవ అర్చక స్వాములు చేపట్టారు. కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News August 17, 2024

ఎల్ బ్రోస్ పర్వతాన్ని అధిరోహించిన సీలేరు కుర్రాడు

image

ఉమ్మడి విశాఖ జిల్లా సీలేరుకు చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న మలసాల శ్రీను కుమారుడు సాయితేజ యూరప్‌లో ఉన్నారు. ఈక్రమంలో రష్యాలో 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఎల్ బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఇందుకు తనకు ఆరు రోజులు పట్టిందని.. ఈ ఘనత సాధించడం చాలా ఆనందంగా ఉందని సాయితేజ పేర్కొన్నాడు.

News August 17, 2024

సింహాచలంలో ఆ సేవ పున:ప్రారంభం

image

సింహాచలంలో సహస్రనామార్చన సేవ తిరిగి ప్రారంభించారు. అంతరాలయంలో రోజూ జరిగే ఈ సేవను కొవిడ్ సమయంలో 2020లో నిలిపివేశారు. భక్తుల నుంచి పలు విన్నపాలు రావడంతో ఈ సేవను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు రూ.500 టికెట్ కొనుగోలు చేసి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఆస్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు అప్పన్న సన్నిధిలో ఈ సేవను జరిపించారు.