Visakhapatnam

News July 30, 2024

23 వాహనాలపై రవాణా శాఖ కేసు నమోదు

image

వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉంటే వాటిపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని ఉప రవాణా కమిషనర్ జీసీ.రాజారత్నం తెలిపారు. వాహనాలలో బ్లాక్ ఫిలిం వెంటనే తొలగించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఎన్‌ఎస్‌టి‌ఎల్, బోయపాలెం, పీఎంపాలెం తదితర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేసి బ్లాక్ ఫిలిం కలిగిన 23 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 30, 2024

ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్టీసీలో విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిషిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు ఒకటి నుంచి 16 తేదీ వరకు తమ పేర్లను www.apprenticeshipindia.gov.in సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

News July 30, 2024

తెరుచుకున్న చాపరాయి జలపాతం

image

సుమారు వారం రోజుల తర్వాత చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల ప్రవేశాలను పునరుద్ధరిచారు. అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో, చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రవేశాలను నిలుపుదల చేశారు. వర్షాలు తగ్గడంతో జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతిస్తున్నారు.

News July 30, 2024

విశాఖలో మెట్రో‌ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు

image

విశాఖలో ఏపీ ప్రభుత్వం 76.90 కి.మీ. లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనను ఈ ఏడాది జనవరిలో చేసిందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజ్యసభలో తెలిపారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ మదింపు నిమిత్తం ముందస్తు అవసరమైన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, 2018ను అప్డేట్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

News July 30, 2024

అండర్-16 విజేత విశాఖ జట్టు

image

అండర్-16 మల్టీ డే అంతర్ జిల్లాల ఫైనల్‌లో విశాఖ జట్టు 433 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెల్లూరులో మూడు రోజులపాటు జరిగిన ఫైనల్ పోరులో కృష్ణా జట్టుపై టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 456 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు 148 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విశాఖ 194/4 చేయగా కృష్ణా 69 రన్స్‌కి ఆల్ అవుట్ అయ్యింది.

News July 30, 2024

ప్రతి కుటుంబానికి రూ.3000: కలెక్టర్

image

వరద బాధిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ముందుగా వీఆర్ పురం, కూనవరం మండలాల్లో పంపిణీ చేయాలన్నారు. మరుసటి రోజు ఎటపాక, చింతూరు మండలాల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. అయితే పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News July 29, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి

image

విశాఖ స్టీల్ ప్లాంట్ మరో అరుదైన రికార్డును సాధించింది. 2024 జులై 26 నాటికి 100 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసి రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ రికార్డు సాధించడానికి కృషి చేసిన అధికారులకు, కార్మికులకు, కాంట్రాక్ట్ వర్కర్లకు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. కేవలం రెండు బ్లాస్ట్ ఫోర్నే‌స్‌లో పనిచేస్తున్నా సరే 100 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదని చెబుతున్నారు.

News July 29, 2024

సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

image

సింహాచలం ఆలయంలో హుండీలలో ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 34 రోజులకు రూ.1,97,06,300 ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. బంగారం 100 గ్రాముల 950 మిల్లీగ్రాములు, వెండి 11 కిలోల 800 గ్రాములు లభించినట్లు పేర్కొన్నారు. 163 యూఎస్ఏ డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లుతో పాటు పలు దేశాల కరెన్సీని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వెల్లడించారు.

News July 29, 2024

విశాఖ – పలాస MEMU శ్రీకాకుళం రోడ్డు వరకే..!

image

పుండి-నౌపాడ విభాగం మధ్యలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ మేరకు విశాఖ-పలాస-విశాఖ (07470 / 07471) MEMU గమ్యస్థానం కుదింపు జరిగిందని సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. జులై 29, ఆగస్టు1, 3తేదీలలో విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-పలాస(07470) MEMU శ్రీకాకుళం రోడ్డు వరకు వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణం పలస-విశాఖ MEMU(07471) శ్రీకాకుళం నుంచి విశాఖ బయలుదేరుతుందని తెలిపారు.

News July 29, 2024

విశాఖ జూ పార్క్‌లో 7 పెద్ద పులులు

image

ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 7 పెద్ద పులులున్నాయని జూ క్యూరేటర్ నందని సలారియ తెలిపారు. నాలుగు తెల్ల పులులు (రెండు జతలు) కాగా మరో మూడు ఎల్లో టైగర్స్ (ఒకటి మగ, రెండు ఆడ) సందర్శకులను అలరిస్తున్నాయని చెప్పారు. జంతు సంరక్షకులు వీటికి సమయానికి ఆహారం, నీరు అందిస్తున్నట్లు తెలిపారు.