WestGodavari

News September 22, 2024

ఏలూరుపాడులో ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదు: SP

image

ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లేక్సీని ఆసరాగా చేసుకొని పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వీడియో అవాస్తవమని జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఎస్పీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వీడియోను ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి వాటిని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 22, 2024

ప.గో జిల్లాలో 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జరిగింది. ఏలూరు జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ప.గో జిల్లా రిజిస్ట్రార్లు కె శ్రీనివాసరావు, లంకా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. మొత్తం 42 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించగా.. 24 మంది జూనియర్ అసిస్టెంట్లు, 14 మంది సబార్డినేట్లు, నలుగురు షరీఫ్లను బదిలీ చేసినట్లు తెలియజేశారు.

News September 22, 2024

ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికలకు 20 పోలింగ్ కేంద్రాలు

image

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నవీకరణ, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను తెలిపేందుకు ఈనెల 24 నుంచి వచ్చేనెల 15 వరకు గడువు ఉందన్నారు.

News September 22, 2024

గోదావరిలోకి దూకి యువకుడు గల్లంతు

image

గోదావరిలో దూకి వ్యక్తి గల్లంతయిన ఘటన శనివారం కొవ్వూరులో చోటుచేసుకుంది. చాగల్లు గ్రామానికి చెందిన బొల్లిపో రఘు (29) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపానికి గురై కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపైకి వచ్చి అక్కడ బైక్ పార్క్ చేసి అందరూ చూస్తుండగానే గోదావరిలోకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

News September 22, 2024

ప.గో. జిల్లాలో మన ఇల్లు-మన గౌరవం

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ఈ నెల 28న మన ఇల్లు- మన గౌరవం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

News September 22, 2024

దిల్లీ ఫుడ్ ఇండియా ప్రదర్శనలో ఏలూరు ఆహార ఉత్పత్తులు

image

వరల్డ్ ఫుడ్ ఇండియా పేరిట దిల్లీలో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఏలూరు జిల్లా ఆహార ఉత్పత్తులు ప్రదర్శించబడటం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 జిల్లాల నుంచి ఉత్పత్తులు ఎంపిక కాగా.. కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన మథర్ థెరీసా మహిళా స్వయం సహాయక సంఘ అధ్యక్షురాలు కృపామణి తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శనకు ఎంపికకావడం అభినందనీయమన్నారు.

News September 21, 2024

తాళ్లపుడిలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

image

ఉమ్మడి ప.గో.జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తాళ్లపుడి మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు మలకపల్లి జడ్పీ హైస్కూల్‌లో శనివారం జరిగాయి. అండర్ 14,17 బాలబాలికలకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, యోగా, షటిల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌లో 400 మంది పాల్గొన్నగా అత్యుత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. పోటీలను మలకపల్లి గ్రామ సర్పంచ్ రాపాక రాజేశ్వరి ప్రారంభించారు.

News September 21, 2024

కోడలిపై భద్రాచలం ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు ..ప.గో లో కేసు

image

కోడలిని లైంగిక వేధింపులకు గురిచేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడిన విషయం తెలిసిందే. కోడలు తెలిపిన వివరాలు..’పెళ్లైనప్పటి నుంచే వేధించేవాడు. ఇంట్లో వారికి చెప్పినా పట్టించుకోలేదు. ఆయన పోలికలతో మగ బిడ్డ కావాలని బలవంతం చేసేవాడు’. అదే సమయంలో కట్నం కోసం వేధించడంతో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

News September 21, 2024

ఏలూరు: బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ జారీ

image

ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామానికి చెందిన ఘంటసాల రాణి శుక్రవారం ఏలూరు డీఎస్పీ శ్రావణ కుమార్‌ను ఆశ్రయించింది. తాను చనిపోయినట్లు చూపించి 70 సెంట్లు భూమిని భలే హానొక్ పేరుపై మార్చారని ఆరోపించింది. రాణి చనిపోయినట్టుగా 2012లో డెత్ సర్టిఫికెట్‌పై సాక్షి సంతకాలు పెట్టిన ఘంటసాల నాగార్జున, సైదు వీరయ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 21, 2024

ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

image

రైల్వే లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగా ఏలూరు మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29న తిరుపతి- విశాఖపట్నం, 30న విశాఖపట్నం- తిరుపతి, విజయవాడ- విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, రాజమహేంద్రవరం – విశాఖపట్నం, అలాగే అక్టోబర్ 1న విశాఖపట్నం- గుంటూరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.