news

News March 28, 2025

భారత్‌లోనూ భూకంప తీవ్రత

image

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

News March 28, 2025

తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

image

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.

News March 28, 2025

బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

image

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.

News March 28, 2025

వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

image

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్‌తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత:

News March 28, 2025

క్రిష్-4తో డైరెక్టర్‌గా మారనున్న హృతిక్

image

క్రిష్ సిరీస్‌లో నాలుగో సినిమా ‘క్రిష్-4’కు రంగం సిద్ధమైంది. ఆ మూవీ హీరో హృతిక్ రోషన్ ఆ సినిమాకు దర్శకత్వం కూడా చేయనున్నారని ఆయన తండ్రి రాకేశ్ రోషన్ ట్విటర్లో ప్రకటించారు. ‘పాతికేళ్ల క్రితం నిన్ను హీరోగా తెరపైకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆది చోప్రాతో కలిసి నిర్మిస్తూ నిన్ను క్రిష్-4 దర్శకుడిగా కూడా పరిచయం చేస్తున్నాను. ఈ కొత్త పాత్రలో ఆల్ ది బెస్ట్. నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

మంగోలియా ఎడారిలో గోళ్ల డైనోసార్ల అవశేషాలు

image

మంగోలియాలోని గోబీ ఎడారిలో నివసించిన 2 గోళ్ల డైనోసార్ జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డ్యుయోనైకస్ సొబాటరీగా పిలిచే ఈ డైనోసార్లు వాటి వెనుక కాళ్లపై నిల్చునేవని, ఒక మోస్తరు పరిమాణంలో సుమారు 260kgs బరువులో ఉండేవని గుర్తించారు. పొడవైన, వంపు తిరిగిన గోళ్లు కలిగి ఉండి, వృక్ష సంపదను తిని బతికినట్లు భావిస్తున్నారు. ఇలాంటి డైనోసార్లను జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రంలో చూపించారు.

News March 28, 2025

ఏప్రిల్ 9 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు

image

AP: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను సీఐడీ కోర్టు ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

News March 28, 2025

మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: కేటీఆర్

image

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్‌లో తెలిపారు. ‘BYD రాష్ట్రంలో 10బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022-23లో ఒప్పందం చేసుకున్నాం. కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

RCB గెలుపు దాహం తీర్చుకుంటుందా?

image

IPLలో భాగంగా ఇవాళ చెపాక్ స్టేడియంలో RCBvsCSK మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపును ఇవాళ కూడా కొనసాగించాలని CSK భావిస్తోంది. పైగా ఈ స్టేడియంలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. ఇక్కడ చివరగా 17 ఏళ్ల క్రితం 2008లో CSKపై RCB గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచులు ఆడితే ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి సత్తా చూపెట్టాలని RCB వ్యూహాలు రచిస్తోంది.

News March 28, 2025

వచ్చే నెలలో థాయ్‌లాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన

image

వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్‌లో జరిగిన సదస్సు అనంతరం BIMSTEC నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాల్ని చేసుకునే అవకాశం ఉంది.

error: Content is protected !!