news

News March 16, 2025

టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

image

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

News March 16, 2025

పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

image

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.

News March 16, 2025

అమరావతి కోసం రూ.11వేల కోట్లు.. నేడు ఒప్పందం

image

AP: నేడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం కుదరనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 22న హడ్కో రూ.11వేల కోట్ల రుణం మంజూరు చేసింది. నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదరనుంది. అగ్రిమెంట్ అయ్యాక హడ్కో నిధులను విడుదల చేయనుంది.

News March 16, 2025

పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (1/2)

image

ప్రత్యేక రాష్ట్రమంటూ లేనప్పుడు తెలుగువారికి అన్నివైపులా అవమానాలే జరిగేవి. అది భరించలేకపోయిన పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంటి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించారు. మద్రాసు CM రాజాజీ వార్నింగ్ కారణంగా తెలుగు కాంగ్రెస్ వారెవరూ మద్దతుగా రాలేదు. ఒంటరైనా, పేగులు పుళ్లు పడి పురుగులు పట్టి అనుక్షణం నరకాన్ని చూస్తున్నా దీక్షను మాత్రం శ్రీరాములు ఆపలేదు. చివరికి 1952, డిసెంబరు 15న అమరుడయ్యారు.

News March 16, 2025

పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. (2/2)

image

తమ ఆత్మగౌరవం కోసం ఆ మహానుభావుడు చిత్రవధ అనుభవించి చనిపోతే తెలుగువారెవరూ స్పందించలేదు. అంత్యక్రియలకే దిక్కులేదు. గాయకుడు ఘంటసాల ఎద్దులబండిపై శవయాత్ర ప్రారంభించారు. ఈలోగా చేరుకున్న ప్రకాశం పంతులు బండెక్కి తెలుగువారి చేతకానితనంపై బూతులు లంకించుకున్నారు. క్షణాల్లో నగరమంతా వార్త పాకింది. లక్షల్లో జనం జతయ్యారు. మద్రాసు తగలబడింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రకటన వెలువడింది.

News March 16, 2025

CM రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి: KTR

image

TG: OUలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని KTR అన్నారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో CM సమాధానం చెప్పాలన్నారు. ‘ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న CM, 6 గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు’ అని ట్వీట్ చేశారు.

News March 16, 2025

టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

image

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్‌ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.

News March 16, 2025

ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతి నొప్పి, ఆస్పత్రిలో చేరిక

image

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల మూల్యాంకనంలో లోపాలు: ప్రసన్న హరికృష్ణ

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడంపై MLC అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని అన్నారు. సబ్జెక్టులపై అవగాహన లేని వారితో వాల్యుయేషన్ చేయించారని, EM బ్లూప్రింట్‌ను TMలోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వడంతో TM వారికి అన్యాయం జరిగిందన్నారు. టాప్-100లో TM, ఉర్దూ మీడియం వారు ఎందరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

image

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.