news

News December 31, 2024

గాలిపటాలు ఎగరవేసే వారికి రైల్వే సూచనలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగురవేయొద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. రైల్వే యార్డులు, గేట్లు, ట్రాకుల వద్ద ఉన్న కరెంట్ తీగలకు సమీపంలో ఎగురవేసి గతంలో చాలా మంది ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అధిక వోల్టేజీతో ఉన్న తీగలకు చైనా మంజా వంటి దారాలు తాకితే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నారు. ఎక్కడైనా తీగలకు దారాలు వేలాడితే తమకు సమాచారం ఇవ్వాలంది.

News December 31, 2024

సీఎం రేవంత్ ఆస్తి ఎంతంటే…

image

TG: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ ఏడో స్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక రూ.931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో, రూ.332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమాఖండు రెండో స్థానంలో నిలిచారు. కేవలం రూ.15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు.

News December 31, 2024

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్

image

దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్‌ను అరెస్టు చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆయన్ను విచారించాలని కోర్టు అధికారుల్ని ఆదేశించింది. ఆయన కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News December 31, 2024

మందుబాబులకు గుడ్‌న్యూస్

image

AP: నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. న్యూఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు ఒంటి గంట వరకు విక్రయాలు జరపనున్నాయి. బెల్టు షాపుల దోపిడీ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News December 31, 2024

జనవరి 3న క్యాబినెట్ భేటీ

image

TG: జనవరి 3న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగనుంది. రైతు భరోసా విధివిధానాలు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల చొప్పున చెల్లింపు సహా మరికొన్ని అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపు తేదీతో పాటు రైతుభరోసా అమలు తేదీపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ నెలలోనే క్యాబినెట్ భేటీ జరగాల్సి ఉండగా మన్మోహన్ మరణంతో వాయిదా పడింది.

News December 31, 2024

రాష్ట్రంలో 200 కొత్త గ్రామ పంచాయతీలు!

image

TG: రాష్ట్రంలో కొత్తగా 200 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశముంది. జనాభా, దూరం వంటి అంశాల ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం వీటిని ప్రకటించి ఎలక్షన్స్‌కు వెళ్లే అవకాశముంది. దీంతో పాటు పలు జిల్లాల్లో కొత్త మండలాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.

News December 31, 2024

ఆ ఉద్యోగులకు నేడే అకౌంట్లో జీతాల జమ

image

AP: రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు నేడు జీతాలు అందనున్నాయి. ఆ ఉద్యోగుల శాలరీలు విడుదల చేసి ఒక రోజు ముందుగా స్లాట్ ఇవ్వడంతో మంగళవారం అకౌంట్లో జమ కానున్నాయి. తమ ప్రభుత్వం వచ్చాక PR ఉద్యోగులకు 1న జీతాలు అందుతున్నాయని, ఈ నెల ఒక రోజు ముందుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అటు సామాజిక పింఛన్లు సైతం ఒక రోజు ముందుగా ఇవాళే పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

News December 31, 2024

హరీశ్‌రావుకు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో జనవరి 9 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్ గతంలో దాఖలు చేసిన ఈ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. వాదనలకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణ వాయిదా వేశారు.

News December 31, 2024

నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న ఆయన వి.ఏడుకొండలు, తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామస్థులతో సీఎం ముచ్చటిస్తారని, అందుకోసం వేదిక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. అనంతరం CM కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారని పార్టీ నేతలు తెలిపారు.

News December 31, 2024

రేపు సెలవు

image

తెలంగాణలో జనవరి 1న సెలవు ఉండనుంది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. దీంతో రేపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. ఇంతకీ రేపు మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.