news

News August 21, 2024

హాస్టళ్లకు కీలక ఆదేశాలు

image

AP: అనకాపల్లిలో కలుషిత ఆహారం తిని నలుగురు చిన్నారులు <<13890531>>మృతి చెందిన<<>> ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు అలర్ట్‌గా ఉండాలని మంత్రి సవిత సూచించారు. బయటి ఆహారాన్ని హాస్టళ్లలోకి అనుమతించొద్దని, విద్యార్థులు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. సురక్షిత ఆహారం అందించాలని, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News August 21, 2024

మూడో టర్మ్‌లో యూటర్న్‌లు.. ఎందుకో?

image

కేంద్రం 3 నెలల కాలంలోనే నాలుగు విషయాల్లో వెనక్కి తగ్గింది. ప్రసారసేవల నియంత్రణ బిల్లును వెనక్కి తీసుకుంది. వక్ఫ్ బిల్లులో కీలక మార్పుల కోసం JPC ఏర్పాటు చేసింది. మూలధన లాభాల పన్నులో ఇండెక్సేషన్ ప్రయోజనాల విషయంలో తగ్గిన కేంద్రం ఇప్పుడు ల్యాటరల్ ఎంట్రీ విషయంలోనూ అలాగే చేసింది. మెజారిటీకి అవసరమైన బలం లేకపోవడం, మిత్రపక్షాలపై ఆధారపడటంతో స్వతంత్రంగా వ్యవహరించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News August 21, 2024

అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ: మంత్రి

image

AP: రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పాలసీ విధివిధానాలపై ఇప్పటికే కమిటీ వేసినట్లు చెప్పారు. ఇసుక, మద్యం వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంలో నాయకులు దారుణంగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారని విమర్శించారు. గత ప్రభుత్వ పాపాలు ఇప్పటికీ ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

News August 21, 2024

ఇవాళ భారత్ బంద్.. పిల్లలను స్కూలుకు పంపుతున్నారా?

image

ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బీఎస్పీ సహా పలు సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునివ్వగా స్కూళ్లు, కాలేజీల విషయంలో అయోమయం నెలకొంది. APలోని ఆంధ్రా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ సెలవు ప్రకటించారు. మరోవైపు ఈ రోజు సెలవు అని స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు మెసేజులు రాలేదు. ఎవరైనా వచ్చి ఆందోళన చేస్తే హాలిడే ఇస్తామని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరి మీ పిల్లలను ఇవాళ స్కూలుకు పంపుతున్నారా?

News August 21, 2024

బీసీసీఐకి గత ఏడాది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం

image

BCCIకి గత ఏడాది IPL ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి పెట్టింది. గత సీజన్లో ఏకంగా రూ.5120 కోట్ల అదనపు ఆదాయం చేకూరింది. 2022తో(రూ.2367 కోట్లు) పోలిస్తే ఇది 116శాతం ఎక్కువ. గత ఏడాది బీసీసీఐ మొత్తం ఆదాయం రూ.11,769 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 78శాతం ఎక్కువ. మీడియా హక్కులు, స్పాన్సర్‌ షిప్ డీల్స్ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ఇక ఖర్చు కూడా 66శాతం పెరిగి రూ.6468 కోట్లకు చేరింది.

News August 21, 2024

నేడు, రేపు పార్టీ నేతలతో జగన్ సమావేశం

image

AP: బెంగళూరు పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. బుధ, గురువారాల్లో పార్టీ నేతలతో ఆయన సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఆయా రోజుల్లో జగన్ ఇతరులను కలిసేందుకు సమయం ఉండదని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.

News August 21, 2024

మహిళలకు ఫ్రీ బస్సుపై నేడు ప్రకటన?

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇవాళ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ స్కీం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని.. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, డ్రైవర్లను నియమించాలని ఇప్పటికే అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం 10వేల ఆర్టీసీ బస్సులు ఉండగా మరో 2వేల కొత్త బస్సులు, 3,500 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు.

News August 21, 2024

మూడో ర్యాంకుకు చేరుకున్న మంధాన

image

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక ప్లేస్ ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నారు. టీ20 ర్యాంకుల్లో 4వస్థానంలో ఉన్నారు. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ వన్డేల్లో 9వ స్థానంలో ఉన్నారు. వన్డే బౌలింగ్‌ ర్యాంకుల్లో భారత్ నుంచి దీప్తి శర్మ(3) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. టీ20 బౌలింగ్‌ విషయంలోనూ దీప్తి 3వ స్థానంలో ఉండగా రేణుకా సింగ్ 5వ ర్యాంకులో ఉన్నారు.

News August 21, 2024

‘ప్రైవేట్’లో EWS కోటా అమలు చేయట్లేదు: NTR వర్సిటీ

image

AP: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఓపెన్ కేటగిరీలో భర్తీ చేసే 50 శాతం సీట్లలో EWS కోటా(10శాతం సీట్లు) అమలు చేయడం లేదని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. దీనిపై ప్రభుత్వం తెచ్చిన జీవో 94ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుని ఆశ్రయించగా ఆ జీవోను ధర్మాసనం సస్పెండ్ చేసిందని వర్సిటీ లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని NMC, ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

News August 21, 2024

డీఎస్సీపై 28వేలకు పైగా అభ్యంతరాలు.. ఈ నెలాఖరుకల్లా ఫలితాలు!

image

TG: డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలపై ఈ నెల 13 నుంచి 20 మధ్యలో 28 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కో ప్రశ్నపై వేలాదిమంది అభ్యంతరం చెప్పడం వల్లే మొత్తం సంఖ్య ఆ స్థాయికి చేరిందని వివరించాయి. ఫలితాలను ఈ నెలాఖరుకల్లా విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి.