news

News August 19, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ BRS MLC కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 20న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం విచారించనుంది.

News August 19, 2024

తీవ్ర విషాదం.. రాఖీ కట్టి చనిపోయింది

image

TG: సోదరులకు రాఖీ కట్టి ఓ సోదరి తుదిశ్వాస విడిచిన విషాద ఘటన మహబూబాబాద్(D) నర్సింహులపేట(మ)లో జరిగింది. కోదాడలో డిప్లొమా చదువుతున్న ఆమె(17)ను ప్రేమ పేరుతో ఆకతాయి వేధిస్తుండటంతో మనస్తాపం చెంది గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో MHBDలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న తాను రక్షాబంధన్ వరకు ఉంటానో లేదోనంటూ శనివారం రాత్రి తమ్ముడు, అన్నలకు రాఖీ కట్టి గంటల్లోనే తుదిశ్వాస విడిచింది.

News August 19, 2024

లేటరల్ ఎంట్రీ.. తెచ్చింది కాంగ్రెసే: ప్రభుత్వ వర్గాలు

image

కాంగ్రెస్ నేతృత్వంలోని UPAనే మొదట లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వీరప్ప మొయిలీ (కాంగ్రెస్) సారథ్యంలోని రెండో పరిపాలనా సంస్కరణ కమిషన్ దీనికి గట్టిగా మద్దతిచ్చిందని పేర్కొన్నాయి. పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, సిటిజన్ ఫ్రెండ్లీనెస్ పెంచేందుకు సంస్కరణలు చేపట్టాలని కమిషన్ నొక్కి చెప్పిందన్నాయి. కొన్ని పదవులకు ప్రత్యేక నైపుణ్యాలు, విజ్ఞానం అవసరమే అన్నాయి.

News August 19, 2024

ఇదొక అదృష్టంగా భావిస్తున్నా: నిత్యామేనన్

image

జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని హీరోయిన్ నిత్యామేనన్ అన్నారు. ఇదొక అదృష్టంగా భావిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అవార్డును ప్రకటించిన తర్వాత నుంచి అభినందనలు తెలిపేందుకు కాల్స్ వస్తూనే ఉన్నాయని తెలిపారు. అవార్డు వచ్చాక తాను ఎంపిక చేసుకునే చిత్రాలు, టీమ్ మారవని స్పష్టతనిచ్చారు. ‘తిరుచిత్రంబలం’ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం వరించింది.

News August 19, 2024

మీకు అన్నివేళలా అండగా ఉంటా: CBN

image

AP: ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. టీడీపీ ఆది నుంచి ఆడబిడ్డల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశమే. డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మీకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు.

News August 19, 2024

ఉద్యోగులకు ప్రమోషన్లు.. CM, Dy.CM ఫొటోలకు పాలాభిషేకం

image

TG: సదరన్ డిస్కంలో ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ CM, డిప్యూటీ సీఎం ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వారంలోనే పరిష్కరించిందని పేర్కొన్నారు.

News August 19, 2024

ఎల్లుండి భారత్ బంద్‌కు పిలుపు

image

SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ AUG 21న భారత్ బంద్‌కు SC వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో-కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్‌లో SC, ST సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని కోరారు.

News August 19, 2024

కరుణానిధి పేరిట నాణెం.. బీజేపీపై AIADMK ఫైర్

image

డీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి వందో జయంతి సందర్భంగా రూపొందించిన రూ.100 నాణేన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం విడుదల చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనిపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ, డీఎంకే చీకటి ఒప్పందంలో ఉన్నాయని అందుకే బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శలు వ్యక్తం చేసింది.

News August 19, 2024

హనుమకొండ బెటాలియన్ ఎత్తివేత

image

TG: హనుమకొండలోని 58వ బెటాలియన్‌ను శాశ్వతంగా ఎత్తివేస్తూ సీఆర్పీఎఫ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టుల ప్రాబల్యంతో 1990లో పలివేల్పుల రోడ్డులో దీనిని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మావోల ప్రాబల్యం తగ్గడంతో మణిపుర్‌లో నెలకొల్పాలని నిర్ణయించారు. దీనితో పాటు కాటారం, మహముత్తారం పరిధిలోని జీ 58, బీ 58 బెటాలియన్లలోని 238 మంది జవాన్లను తరలించనున్నట్లు సమాచారం.

News August 19, 2024

మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తం

image

మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భారత సర్కారు అప్రమత్తమైంది. వైరస్‌ను అడ్డుకోవడమెలా అన్నదానిపై PM మోదీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో కేసులు లేనప్పటికీ, వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై ఆయన అధికారులను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ విజృంభిస్తోంది. అక్కడ ఈ కేసుల సంఖ్య 18,737కు చేరడం ఆందోళనకరంగా మారింది.

error: Content is protected !!