news

News July 15, 2024

వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది: TCS

image

కొవిడ్ సమయంలో ప్రారంభమైన వర్క్ ఫ్రం హోమ్ దాదాపు ముగిసిందని TCS CHRO మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు 18 నెలలుగా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని తెలిపారు. వారంలో 5 రోజులపాటు ఆఫీసుల నుంచి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 70 శాతం పైనే ఉంటుందన్నారు. కాగా మిగతా దిగ్గజ కంపెనీలు కూడా సిబ్బందిని కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.

News July 15, 2024

చంద్రుడిపై నావిగేషన్.. చైనా ప్రణాళిక

image

భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా సైంటిస్టులు ప్రణాళిక సిద్ధం చేశారు. మూన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు వీలుగా 4 కక్ష్యల్లో 21 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2022లో జపాన్ శాస్త్రవేత్తలు కూడా చంద్రుడిపై 8 శాటిలైట్లతో లూనార్ నావిగేషన్ సిస్టమ్‌ను ప్రతిపాదించగా, ఆ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు.

News July 15, 2024

2030 నాటికి ₹580L cr రిటైల్ డిజిటల్ చెల్లింపులు

image

దేశంలో 2022లో ఇ- కామర్స్ మార్కెట్ ₹6.5L cr ఉండగా, 2030 నాటికి 21% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2023-24లో దాదాపు ₹300L cr ఉండగా, 2030కి ₹580L crకు చేరొచ్చని తెలిపింది. 1965-1996 మధ్య జన్మించిన వారు 72% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారని పేర్కొంది. అమెజాన్ పే, కార్ని సంయుక్తంగా 120 నగరాల్లో ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ పేరుతో ఈ అధ్యయనం చేసింది.

News July 15, 2024

ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థికసాయం అందజేయనుందట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ₹5లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది.

News July 15, 2024

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణాలు

image

AP: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించారు. ఎంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు రోజుల్లో హడ్కోకు నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న 1.17లక్షల గృహాలను పూర్తిచేయడానికి ₹5,070 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

News July 15, 2024

23 నుంచి ‘పొలం పిలుస్తోంది’

image

AP: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట పట్టనున్నారు. వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాలవారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు.

News July 15, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంగనర్‌లో పిడుగులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా నిన్న హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

News July 15, 2024

GPS రద్దు చేసి OPS అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు GPSను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్(OPS)ను తీసుకురావాలని SGTF, PRTU, UTF, సీపీఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గెజిట్ పత్రాలను దహనం చేశాయి. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు APTF వెల్లడించింది.

News July 15, 2024

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

image

TG: పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఎక్కువ శాతం DSC అభ్యర్థులే రాయనున్నారని ఎగ్జామ్ వాయిదా వేయడంలో ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని ఆయన కోరారు.

News July 15, 2024

డిసెంబర్‌లోగా బీజేపీకి కొత్త చీఫ్?

image

ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా BJP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తికానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్‌లో మండల, జిల్లా చీఫ్‌ల నియామకం, డిసెంబర్‌లో రాష్ట్రాధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్‌ రానున్నట్లు తెలుస్తోంది.