news

News September 12, 2024

భర్త నుంచి వచ్చే భరణంపై ఆధారపడటం సరికాదు: హైకోర్టు

image

భర్త నుంచి భరణం వస్తుంది కదా అని సంపాదించుకోవడం ఆపేయడం సరికాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. ఉన్నత చదువు, అర్హతలు ఉండి కూడా ఏ పని చేయకపోవడం సరికాదంది. నెలకు ₹60వేల భరణం సరిపోదని, పెంచాలని భార్య హైకోర్టును ఆశ్రయించింది. ‘ఏ కారణం లేకుండానే ఆమె విడిగా ఉంటోంది. గతంలో ఉద్యోగం చేసింది. బ్యూటీ పార్లర్‌తో బాగానే సంపాదిస్తోంది. భరణం తగ్గించండి’ అని భర్త వాదించగా, కోర్టు ₹40వేలకు తగ్గించింది.

News September 12, 2024

నేడు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

image

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ నష్టం అంచనా వేయనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ, బుడమేరు, వ్యవసాయ పంటలు పరిశీలించనుంది. అలాగే గుంటూరు జిల్లాలోని పెదకాకాని కాలువలు, దేవరాయబొట్లపాలెం పంటపొలాలు పరిశీలించి మంగళగిరి ప్రజలతో మాట్లాడనుంది.

News September 12, 2024

పొదుపు మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు

image

TG: రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం అధ్యయనం చేస్తున్నారు.

News September 12, 2024

ఐఫోన్‌ను అత్యధికంగా కొనేది ఈ దేశంలోనే

image

యాపిల్ రూపొందిస్తున్న ఐఫోన్‌ను జపనీయులు ఎక్కువగా కొంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆ దేశంలో 59 % మంది దీనిని వాడుతున్నారు. ఆ తర్వాత కెనడా (56%), ఆస్ట్రేలియా (53%), అమెరికా (51%), యూకే (48%), ఇటలీ (30%), స్పెయిన్ (29%), చైనా (21%), మెక్సికో (20%), ఉన్నాయి. కాగా ఇండియాలో 5 శాతం మంది మాత్రమే ఐఫోన్ ఉపయోగిస్తున్నారు. 19 % మంది సామ్‌సంగ్, 76 % మంది ఇతర ఫోన్లు వాడుతున్నారు. మీ ఫోన్ ఏదో కామెంట్ చేయండి.

News September 12, 2024

ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధం: హమాస్

image

కొత్త షరతులేవీ విధించకుండానే ఇజ్రాయెల్‌తో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామని ఖతర్ PM షేక్ మొహమ్మద్ బిన్, ఈజిప్టు ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్‌ను మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. మరోవైపు త్వరలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య చర్చలు జరుపుతామని US CIA డైరెక్టర్ విలియమ్ బర్న్స్ తెలిపారు. ఇప్పటివరకు గాజా యుద్ధంలో 41,084 మంది పాలస్తీనియన్లు మరణించారు.

News September 12, 2024

లేఆఫ్‌లు కొనసాగుతాయంటున్న ‘డెల్’

image

తమ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రముఖ టెక్ కంపెనీ డెల్ తెలిపింది. పర్సనల్ కంప్యూటర్‌లకు డిమాండ్ పెరగకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్‌ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఖర్చుల నియంత్రణ కోసం లేఆఫ్‌లు తప్పవని చెప్పింది. కాగా గత నెలలో డెల్ కంపెనీ 12,500 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది.

News September 12, 2024

ఒకే టీమ్‌లో కోహ్లీ, బాబర్ అజామ్?

image

త్వరలో టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కలిసి ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రో-ఆసియా కప్‌ను ICC తిరిగి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆసియా జట్టు తరఫున కోహ్లీ, రోహిత్, బాబర్, బుమ్రా, అఫ్రీది, రిజ్వాన్ వంటి ఆటగాళ్లు కలిసి ఆడనున్నారు. గతంలో ఆసియా జట్టులో సెహ్వాగ్, అఫ్రీది, సంగక్కర, జయవర్ధనే, ఇంజమామ్, నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ కలిసి ఆడారు.

News September 12, 2024

‘కాంచన 4’లో పూజా హెగ్డే?

image

హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తెరకెక్కించనున్న ‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా కాంచన సిరీస్‌లో ఇప్పటికే ముని, కాంచన 2, గంగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కబోయే కాంచన 4ను రూ.100 కోట్ల బడ్జెట్‌తో గోల్డ్ మైన్ మూవీస్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

News September 12, 2024

శరవేగంగా వారణాసి స్టేడియం పనులు

image

వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.

News September 12, 2024

YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత

image

AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.