news

News September 17, 2024

వడ్డీరేటును ఎంత తగ్గిస్తుందో?

image

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. US ఫెడ్ వడ్డీరేటును ఎంతమేర తగ్గిస్తుందోనని ఆత్రుతగా చూస్తున్నారు. బుధవారం ముగిసే సమావేశాల్లో ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారని రాయిటర్స్ అంచనా వేసింది. కనీసం 25 బేసిస్ పాయింట్ల కోత కచ్చితంగా ఉంటుందని అనలిస్టుల మాట. అదే జరిగితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రాకెట్లలా దూసుకెళ్లడం ఖాయం.

News September 17, 2024

జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు.. స్పందించిన చిన్మయి

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. పలు మీడియా కథనాలను ట్యాగ్ చేస్తూ ‘రిపోర్టుల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చిన్మయి ట్వీట్ చేశారు. కాగా ఆమె గతంలో రచయిత వైరముత్తు, సింగర్ కార్తీక్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.

News September 17, 2024

మద్యం పాలసీపై అభిప్రాయాలు సేకరిస్తున్న ఎక్సైజ్ శాఖ

image

AP: రాష్ట్రంలో అమలు చేయనున్న కొత్త మద్యం పాలసీపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్ ఆఫీసులో లేదా మంగళగిరి IHC టవర్స్‌లోని పాత సెబ్ ఆఫీసులో రాత పూర్వకంగా అందించవచ్చని లేదా apcommissioner.pe@gmail.comకు ఈమెయిల్ చేయవచ్చన్నారు.

News September 17, 2024

భారత్‌లో యాపిల్ పోటీతో శామ్‌సంగ్‌ ఉక్కిరి బిక్కిరి

image

భారత మొబైల్ మార్కెట్లో శామ్‌సంగ్‌కు యాపిల్ గట్టి పోటీనిస్తోంది. ప్రత్యర్థితో పోలిస్తే సగం కన్నా తక్కువ ఫోన్లే షిప్పింగ్ చేసి ఎక్కువ రెవెన్యూ సంపాదించింది. అధిక యావరేజ్ సెల్లింగ్ ప్రైస్, దూకుడుగా మార్కెట్‌ను విస్తరించడమే ఇందుకు కారణాలు. 2024లో జూన్ నాటికి యాపిల్ 48 లక్షల యూనిట్ల ద్వారా $4.56 బిలియన్లు ఆర్జిస్తే శామ్‌సంగ్ 98 లక్షల యూనిట్ల షిప్పింగ్‌తో $3.43 బిలియన్లే ఆర్జించినట్టు IDC తెలిపింది.

News September 17, 2024

HYDలో ఇవాళ 3 కీలక ఘట్టాలు.. భారీ బందోబస్తు

image

TG: హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ 3 కీలక ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి. ఓ వైపు గణేశ్ శోభాయాత్ర, వేలాది విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మరోవైపు పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ప్రజా పాలన దినోత్సవానికి సీఎం రేవంత్, పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే విమోచన దినోత్సవానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్, సంజయ్, కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

News September 17, 2024

ఈ ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్: మంత్రి ఉత్తమ్

image

TG: సన్న వడ్లకు క్వింటాపై ₹500 బోనస్ ఈ ఖరీఫ్ నుంచే ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెప్పారు. వరి సాధారణ రకానికి ₹2,300, ఏ-గ్రేడుకు ₹2,320 మద్దతు ధర ఉండగా, ₹500 బోనస్ కలిపి రైతులకు అందజేయనున్నారు. 18 రకాల సన్న రకం ధాన్యానికి ఈ బోనస్ వర్తించనుంది. దొడ్డు రకానికీ బోనస్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

News September 17, 2024

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ: మాజీ ఎంపీ GV

image

AP: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో కలిసి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ GV హర్షకుమార్ ప్రకటించారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ఎవరనేది త్వరలో ప్రకటిస్తామని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.

News September 17, 2024

ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్!

image

TG: ఒకరిపై మరొకరు నిత్యం తీవ్ర విమర్శలు చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభను ఈనెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు కేటీఆర్‌కు ఆహ్వానం పంపామని, వారు పాల్గొంటారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

News September 17, 2024

భారత్vs చైనా.. నేడు ఫైనల్

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో అదరగొట్టిన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఫైనల్‌లో చైనాను ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్స్ టెన్-1 ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న టీమ్ ఇండియా ఐదో ట్రోఫీ సాధించాలని పట్టుదలగా ఉంది. అనూహ్యంగా ఫైనల్ చేరిన చైనా తొలి టైటిల్ కోసం ఆరాటపడుతోంది.

News September 17, 2024

గణేశ్ నిమజ్జనం.. మద్యం షాప్‌లు బంద్

image

TG: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్‌లు క్లోజ్ అయ్యాయి. రేపు సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ CV ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.