news

News March 23, 2024

ఓటు వేయాలని బలవంతం చేయలేం: మద్రాసు హైకోర్టు

image

ఓటు వేయాలని ఒకరిని ఎలా బలవంతం చేస్తారని మద్రాసు హైకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమిళనాడు తిరుచ్చెందూర్‌కు చెందిన రామ్‌కుమార్ ‘చట్టప్రకారం ఉద్యోగులు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నారు. వారు ఓటు వేసినట్లు తెలిపే ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలి’ అని పిటిషన్‌ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించలేమని తీర్పిచ్చింది.

News March 23, 2024

సుదీర్ఘ విరామం తర్వాత పంత్ మ్యాచ్

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడనున్నారు. IPLలో భాగంగా ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నారు. 2022 డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకున్న అతడు పూర్తిగా కోలుకోవడానికి ఏడాది పట్టింది. ఇటీవలే ఫుల్ ఫిట్నెస్ సాధించిన ఈ ఢిల్లీ కెప్టెన్ బ్యాటింగ్ కోసం అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News March 23, 2024

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఉచిత బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవాలని కోరారు. https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.

News March 23, 2024

పోలింగ్ రోజు సెలవు ప్రకటన

image

TG: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక పోలింగ్(మే 13) రోజు వేతనంతో కూడిన సెలవును ఇస్తున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు మంజూరు చేసినట్లు పేర్కొంది.

News March 23, 2024

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లు కాగా గతేడాది ఇదే సమయానికి 166.97 మి.యూనిట్లుగా ఉంది. 43.01% మేర పెరిగింది. గత సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ సమ్మర్‌లో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News March 23, 2024

బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యావ్యవస్థపై దాడి చేస్తున్నాయి: కోదండరామ్

image

TG: గుజరాత్ నేరస్థులను అందలం ఎక్కిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యావ్యవస్థపై దాడి చేస్తూ అశాస్త్రీయ విషయాలను అందులో చొప్పిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు.

News March 23, 2024

ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయండి: BRS

image

TG: ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఫిర్యాదు లేఖ అందజేసింది. వీరు బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందులో పేర్కొంది. కాగా తమ ఫిర్యాదుపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

News March 23, 2024

YCP ఇప్పటివరకూ గెలవని సెగ్మెంట్లు ఇవే

image

AP: రాష్ట్రంలోని 20 స్థానాల్లో వైసీపీ ఇప్పటివరకూ గెలవలేదు. ఇందులో కుప్పం, హిందూపురం, చీరాల, కొండెపి, పర్చూరు, గుంటూరు 2, గన్నవరం, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, రాజోలు, మండపేట, వైజాగ్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, టెక్కలి, ఇచ్చాపురం స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.

News March 23, 2024

నేడు ఐపీఎల్‌లో డబుల్ హెడర్

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని MYS స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

News March 23, 2024

మాజీ మంత్రి గంటా ఆస్తుల వేలం!

image

AP: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధమైంది. గంటా, ఆయన బంధువులు కలిసి బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. రూ.390.7 కోట్ల రుణం చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొంది. పద్మనాభం మండలం అయినాడ వద్ద గంటాకు చెందిన స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. వచ్చే నెల 16న వేలం వేయనున్నట్లు వెల్లడించింది.