news

News November 10, 2024

తగిన వ్యక్తులకే నామినేటెడ్ పదవులు: CM

image

AP: దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు <<14568142>>నామినేటెడ్ పదవులు<<>> ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవులు పొందిన వారు పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన వారికి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

News November 10, 2024

బీసీసీఐపై కోర్టుకెళ్లనున్న పాక్?

image

పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేందుకు BCCI నిరాకరించినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తమ మ్యాచులను దుబాయ్‌లో ఆడేలా హైబ్రిడ్ షెడ్యూల్‌ని PCBకి బీసీసీఐ ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించాలని పాక్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ దేశం నుంచి ఒక్క మ్యాచ్‌ను కూడా బయటికి తరలించే ప్రసక్తే లేదని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ఇప్పటికే తేల్చిచెప్పారు.

News November 10, 2024

విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం: కేంద్ర మంత్రి

image

AP: విశాఖ రైల్వే జోన్ కోసం స్థలం కేటాయింపులు జరిగాయని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బీజేపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ సత్తుపల్లి వరకు పూర్తయిందని, అతి త్వరలో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు.

News November 10, 2024

బుమ్రాకు కెప్టెన్సీ చేసే సత్తా ఉంది: పాంటింగ్

image

రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత జట్టును సమర్థవంతంగా లీడ్ చేయగలిగే సత్తా బుమ్రాకు ఉందని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా సీనియర్ బౌలర్. ఎప్పుడు బౌలింగ్ చేయాలో అతడికి తెలుసు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ బాధ్యతలను బ్యాలన్స్ చేయగలడు. కోహ్లీ, అశ్విన్ లాంటి సీనియర్లు కూడా అతనికి అందుబాటులో ఉంటారు’ అని చెప్పారు. AUSతో తొలి టెస్టులో రోహిత్ ఆడకపోవచ్చని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

News November 10, 2024

ట్రంప్ గెలుపు: భయంతో కెనడాలో హై అలర్ట్

image

ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొన్న కెనడాకు మరో తలనొప్పి మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్రమ వలసల భయం పట్టుకుంది. ట్రంప్ తొలి హయాంలో 2017-2021 మధ్య వేలమంది అమెరికా నుంచి కెనడాకు తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్‌పై ఉక్కుపాదం మోపుతానని, అక్రమంగా ఎవరున్నా దేశం నుంచి పంపేస్తానని శపథం చేశారు. దీంతో వారంతా సమీపంలోని కెనడాకే వస్తారన్న అంచనాతో ఆ దేశం హైఅలర్ట్ ప్రకటించింది.

News November 10, 2024

ఉగ్రదాడిలో ఆర్మీ అధికారి మృతి

image

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కిష్ట్‌వార్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మరణించారు. మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఇటీవల ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులు మరణించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.

News November 10, 2024

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కరెక్టేనా?

image

AP: ప్రతిపక్ష హోదా లేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలను YCP బహిష్కరించడం కరెక్ట్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసమైనా సభకు వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పలువురు అంటున్నారు. మెజారిటీ సీట్లు ఇచ్చినప్పుడు అధికార పక్షంగా అసెంబ్లీకి వెళ్లిన వారు, ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సభలో విపక్షం ఉండాల్సిందేనని చెబుతున్నారు.

News November 10, 2024

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ.. గతంలో ఏం జరిగింది?

image

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని YS జగన్ నిర్ణయించడంతో గతంలో NTR, YSR, CBN కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. NTR 1993లో, 1995లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. 1999-2004 మధ్య YSR కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చివరి రెండేళ్లు సమావేశాలకు వెళ్లలేదు. 2014 తర్వాత జగన్, 2021లో చంద్రబాబు CM అయ్యాకే సభకు వస్తామని ప్రతిజ్ఞ చేశారు.

News November 10, 2024

డిసెంబర్ 31లోగా చేయకపోతే..

image

ఫిన్‌టెక్ సంస్థలు కస్టమర్ల ప్రొఫైల్‌ను రూపొందించడం కోసం పాన్ సమాచారాన్ని వాడుతుండటంతో ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాన్‌‌కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకు డిసెంబర్ 31 వరకు గడువునిచ్చింది. లింక్ చేయని పక్షంలో పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్‌‌లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

News November 10, 2024

సినిమా టైటిల్ లీక్.. తీవ్రంగా స్పందించిన డైరెక్టర్

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ లీక్ కావడంపై దర్శకుడు తీవ్రంగా స్పందించారు. తన మూవీ టైటిల్‌ను లీక్ చేసినది తన టీమ్ వారు కాదన్నారు. తన సినిమానే అని కాకుండా ఎవరి మూవీలో ఏ లీక్ జరిగినా సినిమా కోసం కష్టపడే టీమ్‌పై నిందలు వేయడం మానేయాలన్నారు. యూనిట్‌ను నిందించే అలవాటు మానుకోవాలన్నారు. ఈ మూవీ టైటిల్ ‘ది ప్యారడైజ్’గా ఖరారైనట్లు గతంలో సినీ వర్గాలు పేర్కొన్నాయి.