Khammam

News January 20, 2026

ఖమ్మం మార్కెట్‌లో ‘మిర్చి’ ఘాటు.. పత్తి ధరకూ రెక్కలు!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ.8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా, మార్కెట్ ఛైర్మన్ కొనుగోళ్లను పర్యవేక్షించారు.

News January 20, 2026

రేపు ఖమ్మంలో జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనకు రేపు( బుధవారం) ఖమ్మంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం తెలిపారు. ముస్తఫానగర్‌లోని వీవీసీ డెవలప్మెంట్ సెంటర్‌లో టెలీకాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ అర్హత, 18-32 ఏళ్ల వయస్సు గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News January 20, 2026

ఖమ్మం: బాలికపై లైంగికదాడికి యత్నం

image

ముదిగొండ మండలంలో దారుణం జరిగింది. మాయమాటలతో బాలికను కిడ్నాప్ చేసిన గోపి అనే యువకుడు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అమ్మాయి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News January 20, 2026

ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

image

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News January 19, 2026

ఖమ్మం: ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి’

image

సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

News January 19, 2026

కంకర మిల్లు అక్రమాలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు

image

ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో ఉన్న కంకర మిల్లు యాజమాన్యం సాగిస్తున్న అక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ‘ప్రజావాణి’లో గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మిల్లు నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కుతూ పంచాయతీకి రావాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి NOC గానీ, పాలకవర్గ తీర్మానం గానీ లేకుండానే మిల్లు పనులు సాగిస్తున్నారని తెలిపారు.

News January 19, 2026

అడవిలో హైటెక్ పద్ధతిలో వన్యప్రాణుల గణన

image

ఖమ్మం జిల్లాలోని 60,300 హెక్టార్ల అటవీ విస్తీర్ణంలో వన్యప్రాణుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పర్యవేక్షణలో 85 బీట్లలో అధికారులు, వలంటీర్లు 5 రోజుల పాటు కాలినడకన సర్వే చేయనున్నారు. ఈసారి పులులు, చిరుతల ఆనవాళ్లను గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ప్రత్యేక మొబైల్ యాప్, జియో ట్యాగింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

News January 19, 2026

ఖమ్మం జిల్లాలో 27 గ్రామాల్లో ‘సౌర’ వెలుగులు!

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్ స్వయం సమృద్ధి లక్ష్యంగా 27 గ్రామాలను ‘మోడల్ సోలార్ విలేజ్’లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోనకల్, నేలకొండపల్లి, ఎన్కూరు, రఘునాథపాలెం, వైరా మండలాల్లో 16,837 ఇళ్లకు, 4,371పంపుసెట్లకు రెడ్-కో ద్వారా ఉచిత సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు రావినూతలలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

News January 19, 2026

ఖమ్మం: ఉదారతను చాటుకున్న డీఈఓ

image

పదో తరగతి విద్యార్థులపై డీఈఓ చైతన్య జైనీ తన ఉదారతను చాటుకున్నారు. నేలకొండపల్లి మండలంలోని ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 13 పాఠశాలల విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్నాక్స్ అందించాలని నిర్ణయించారు. సుమారు 250 మంది విద్యార్థులకు నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రతిరోజూ సాయంత్రం రూ.20 విలువైన అల్పాహారం పంపిణీ చేయనున్నారు.

News January 19, 2026

నేటి నుంచే సర్పంచులకు ‘పాఠాలు’.. మూడు విడతల్లో శిక్షణ

image

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు వారి విధులు, బాధ్యతలపై నేటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. స్థానిక డీపీఆర్సీ,టీటీడీసీ భవనాల్లో మూడు విడతల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగం వంటి కీలక అంశాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తారు. తొలివిడత నేటి నుంచి 23వరకు ఏడు మండలాల సర్పంచులకు శిక్షణ ఇవ్వనుండగా, ఫిబ్రవరిలో మిగిలిన రెండు విడతలు కొనసాగుతాయి.