India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లాలో ఆదివారం 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా NKPలో 78.9 మిల్లీమీటర్లు, చిట్యాలలో 30.0, కట్టంగూరులో 19.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నకిరేకల్‌లో 13.7, కేతేపల్లిలో 17.6, తిప్పర్తిలో 23.2, నల్గొండలో 12.7, కనగల్‌లో 55.8, అనుములలో 76.2, నిడమనూరులో 41.2, త్రిపురారంలో 31.8, మాడుగులపల్లిలో 59.2, వేములపల్లిలో 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వహణకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు డిపాజిట్ (నాన్ రిఫండబుల్) రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో ఆశావహులు అంతగా ఆసక్తి చూపడం లేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై 17 రోజులైనా 154 షాపులకు ఇప్పటివరకు 163 దరఖాస్తులే రావడంతో అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

NLG జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో ఈ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. వ్యూహ ప్రతివ్యూహాలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. రాబోయేది స్థానిక ఎన్నికల కాలం కావడంతో పార్టీ బీఫామ్స్ అన్నీ డీసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా పంపిణీ అయ్యే అవకాశం ఉంది. డీసీసీ పీఠం.. బీసీ, ఎస్సీలకు అసలు అవకాశమే ఇవ్వరా అని వారు అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు.

జిల్లాలో సుదీర్ఘకాలంగా నీటి సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువులు అధ్వానంగా మారుతున్నాయి. 2006లో ఉమ్మడి ఏపీలో వందెకరాల ఆయకట్టుకుపైగా ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారు. వాటి కాలపరిమితి 2008లో ముగిసినా నేటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. గత ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసిన వాటిపై ఆజమాయిషి లేక నీటి విడుదల, మరమ్మతులపై దృష్టి పెట్టేవారు కరువయ్యారు.

నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుదారులు తమ అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

నల్గొండ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం భక్తుల సందడితో మరింత శోభాయమానమయ్యాయి. సెలవు దినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా నల్గొండకు పట్టణానికి పోటెత్తారు. దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఏర్పాటు చేసిన మేళా దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. క్లాక్ టవర్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉత్సవాల వైభవం స్పష్టమైంది.

విదేశాల్లో విద్యా విధానం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఉపాధ్యాయులను ఐదు రోజుల పాటు సింగపూర్, జపాన్, వియత్నాం, ఫిన్ లాండ్ పర్యటనకు పంపించనుంది. జిల్లాకు ముగ్గురు, నాలుగు బృందాల్లో 40 మంది చొప్పున 160 మందిని ఎంపిక చేయనున్నారు. కలెక్టర్ ఛైర్మన్‌గా ఏడు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని కమిటీ వీరి ఎంపిక జరపనుంది.

నల్గొండ DCC అధ్యక్ష రేసులో పలువురు పోటీ పడుతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కొండేటి మల్లయ్య, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్, దైద రవీందర్, రాజా రమేష్ యాదవ్, సామల శ్రీనివాస్‌లు దరఖాస్తు చేసుకున్నారు. ఆశావహుల్లో ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌కు పంపించనున్నారు.

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బంద్‌లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం మరో 67 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 163 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. .
Sorry, no posts matched your criteria.