Nalgonda

News January 11, 2026

నల్గొండ: గంజాయి విక్రయిస్తున్న వారి అరెస్టు

image

పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్న సయ్యద్ మజీద్ హుస్సేన్, సోహెల్‌ను టాస్క్‌ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

News January 11, 2026

నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

పట్టణంలోని రాంనగర్‌లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.

News January 11, 2026

NLG: లక్ష్యానికి దూరంగా.. మీనం..!

image

నల్గొండ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం పూర్తికాకపోవడం గమనార్హం. జూలైలోనే జలాశయాలు నిండినా, నిధుల విడుదల ఆలస్యమవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ప్రభుత్వం స్పందించి మిగిలిన కోటాను పూర్తి చేయడంతో పాటు, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

News January 11, 2026

నల్గొండ: ఏసీబీలో ‘లీక్’ వీరులు..!

image

అవినీతి తిమింగలాలను పట్టించాల్సిన ACBలోనే కొందరు ‘లీకు వీరులు’ తయారవ్వడం కలకలం రేపుతోంది. దాడులు నిర్వహించాల్సిన సిబ్బందే, సదరు అవినీతి అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ ఏసీబీ విభాగంలో పనిచేస్తున్న ఓ CI, హోంగార్డు కలిసి ఈ దందాను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ మొదలైనట్లు తెలుస్తోంది.

News January 11, 2026

రైతు భరోసా… ఇంకెంతకాలం నిరీక్షణ!

image

రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం జిల్లాలోని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదార్ రైతులు ఉండగా యాసంగి సీజన్‌పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాది జనవరి 26నే ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కాగా.. ఈసారి నవంబర్‌లో సీజన్ ప్రారంభమై ఈ నెలాఖరుకు ముగుస్తున్నా నిధుల ఊసే లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

News January 11, 2026

NLG: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలచే భర్తీ చేయబడే ఉద్యోగాలతోపాటు బ్యాంకింగ్, RRB ఇతర పోటీ పరీక్షలకు ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత రెసిడెన్షియల్, శిక్షణకు అసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.శశికళ తెలిపారు. అభ్యర్థులను పోటీ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారని, ఫిబ్రవరి 8న జరిగే పరీక్షలో పాల్గొనాలని కోరారు.

News January 11, 2026

నల్గొండ ‘కార్పొరేషన్’.. గెజిట్‌ కోసం నిరీక్షణ!

image

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద ఉంది. దీనిపై గెజిట్ విడుదల కావాల్సి ఉండటంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసినప్పటికీ, తుది జాబితా ప్రదర్శనను ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. గెజిట్ వెలువడితేనే 48 వార్డుల పునర్విభజన, మేయర్ పదవి రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.

News January 10, 2026

రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా నల్గొండ వాసి

image

అనుముల మండలంలోని హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర అండర్-17 ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 16 వరకు హరియాణాలో జరిగే 69వ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆయన జట్టుకు నాయకత్వం వహించనున్నారు. గత నవంబర్‌లో నల్గొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను తేజుకు ఈ గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు ఆకాంక్షించారు.

News January 10, 2026

నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

image

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

News January 10, 2026

నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.