News September 3, 2024

ఈ నెలలోనే నాని ‘హిట్-3’ షురూ?

image

‘సరిపోదా శనివారం’ విజయంతో జోరుమీదున్న నాని మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో హిట్-3 షూటింగ్ ఈ నెలలోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను సమాంతరంగా పూర్తి చేస్తారని టాక్.

News September 3, 2024

ప్రకాశం బ్యారేజీకి ముప్పు లేదు: కన్నయ్యనాయుడు

image

AP: ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని విశ్రాంత ఇంజినీర్, ప్రభుత్వ సలహాదారు కన్నయ్యనాయుడు తెలిపారు. ఇసుక బోట్లు ఢీకొనడంతో దెబ్బతిన్న గేటును నిన్న రాత్రి కన్నయ్యనాయుడు పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత మరమ్మతు చేపడతామని, పనులు పూర్తయ్యేందుకు 15 రోజులు అవసరం అని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం తరహాలో ఇక్కడ గేట్ పూర్తిగా కొట్టుకుపోలేదని, కేవలం కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయని వివరించారు.

News September 3, 2024

కుంభవృష్టి, రెడ్ అలర్ట్ అంటే?

image

204.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కుంభవృష్టి అంటారు. వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి కురిసే ఛాన్స్ ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 115.6mm-204.5mm వరకు వాన పడితే అతి భారీ వర్షం, 64.5mm-115.5mm వరకు భారీ వర్షం, 15.6mm-64.4mm వరకు వర్షం పడితే మోస్తరు వర్షపాతంగా పేర్కొంటారు. భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఆరెంజ్, మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఎల్లో, తేలికపాటి జల్లులకు గ్రీన్ అలర్ట్ జారీ చేస్తారు.

News September 3, 2024

ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రివేళ పెట్రోలింగ్‌: మంత్రి ఆదేశం

image

TG: మహిళా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రి సమయాల్లో షీ టీమ్‌లతో పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. అన్ని బోధనాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై మంత్రి సమీక్షించారు.

News September 3, 2024

పాల కొరత.. అర లీటర్ రూ.80

image

AP: వరదల్లో మునిగిపోయిన విజయవాడలో పాల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు పెంచేశారు. అరలీటర్ ప్యాకెట్ రూ.70-80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, కనీసం ఒక్క ప్యాకెటైనా ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయ డెయిరీ, కృష్ణ మిల్క్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ మునిగిపోవడంతో లక్షల లీటర్ల పాలు, పెరుగు ప్యాకెట్లు చెడిపోయాయి. దీంతో సమస్య పెరిగింది.

News September 3, 2024

కాలువలకు గండ్లు.. తెగిన చెరువు కట్టలు

image

TG: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల కాలువలు, చెరువు కట్టలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 196 చెరువు కట్టలు తెగిపోగా 64 కాలువలకు గండ్లు పడ్డాయి. దాదాపు అన్ని చోట్లా తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి. పునరుద్ధరణకు మొత్తం ఖర్చు దాదాపు రూ.100 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఇక మూగజీవాలు మరణించడం వల్ల దాదాపు రూ.1.71కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

News September 3, 2024

అది జడేజా తప్పు కాదు: అశ్విన్

image

స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా టెస్టుల్లో INDకు ఎన్నో విజయాలు అందించారు. ఓవర్సీస్ టెస్టుల్లో చాలా సార్లు వీరిద్దరిలో ఒకరికే ఛాన్స్ దక్కుతోంది. దీంతో అశ్విన్ తుదిజట్టులో ఉండట్లేదు. దీనిపై అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను ఆడకపోవడంలో జడేజా తప్పు లేదు. అలాగే నాకు అతడిపై అసూయ లేదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. నేనెప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తా’ అని తెలిపారు.

News September 3, 2024

నేడు మహబూబాబాద్‌లో CM రేవంత్‌ పర్యటన

image

TG: ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి, పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అటు సీఎం రేవంత్ నిన్న ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

News September 3, 2024

వరద బాధితులకు ఔషధాల పంపిణీ

image

AP: భారీ వర్షాలు, వరదలకు ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. బాధితులకు 75వేల ఎమర్జెన్సీ మందుల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కిట్లలో పారాసిటమాల్, లివో సిట్రెజిన్, డొమిపేరిడోన్, పురోక్సిన్, ORS ప్యాకెట్లు ఉన్నట్లు చెప్పారు. తొలి విడతగా 10వేల కిట్లను అందించినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని వైద్య శిబిరాల్లోనూ ఈ కిట్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

News September 3, 2024

ఎల్లుండి మరో అల్పపీడనం!

image

ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 6వ తేదీన అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 6, 7 తేదీల్లో ప.గో, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. TGలోనూ రాబోయే 5రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంపై నేడు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపింది.