News February 21, 2025

Stock Markets: మెటల్ షేర్లు అదుర్స్.. మిగిలినవి బెదుర్స్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 22,795 (-117), సెన్సెక్స్ 75,311 (-429) వద్ద ముగిశాయి. మెటల్ షేర్లు రాణించాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకు రంగాల సూచీలు ఎరుపెక్కాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఐచర్ మోటార్స్, ఎల్‌టీ, ఎస్బీఐ లైఫ్ టాప్ గెయినర్స్. ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ లూజర్స్.

News February 21, 2025

చిరంజీవి తల్లికి అస్వస్థత.. స్పందించిన మెగా టీమ్

image

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై చిరు టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అంజనమ్మ అస్వస్థతకు గురి కాలేదని, రెగ్యులర్ చెకప్ కోసమే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది.

News February 21, 2025

‘డ్రాగన్’పై నెట్టింట ప్రశంసలు!

image

‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ఈరోజు విడుదలైంది. మరోసారి ట్రెండీ లవ్ స్టోరీతో అదరగొట్టారని సినిమా చూసిన వారు పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంతసేపూ ఇలాంటి కథను ఎక్కడో విన్నట్లు, చూసిన ఫీలింగ్ కలిగిందని అభిప్రాయపడుతున్నారు. సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టాడంటూ ప్రశంసిస్తున్నారు. మీరూ సినిమా చూశారా? COMMENT

News February 21, 2025

జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ఎవరూ నమ్మరు: మంత్రి కొల్లు

image

AP: కిడ్నాపులు చేసిన వారిపై కేసులు పెట్టడం తప్పా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ నేరస్థులను వెనకేసుకురావడం దారుణమన్నారు. ‘జగన్ చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే అసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టినా ఆయనలో ఇంకా మార్పు రాలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ గుంటూరు మిర్చి యార్డులో రాద్ధాంతం చేశారు. ఆయన ఐ ప్యాక్ డ్రామాలను ఎవరూ నమ్మరు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News February 21, 2025

మహిళలకు ఏడాదికి రెండు చీరలు: CM

image

TG: మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘మొదటగా ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఉండేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

News February 21, 2025

పెన్షన్ల తొలగింపుపై ప్రభుత్వం స్పష్టత

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో 2 లక్షల మందికి పెన్షన్లు కట్ చేయనుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ‘పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా, మీడియా, పలు వెబ్ సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది.

News February 21, 2025

అంతుచిక్కని వ్యాధి.. చనిపోతున్న కోళ్లు

image

TG: వనపర్తి జిల్లా కొన్నూరులోని ఓ ఫాంలో 3 రోజుల్లో 2,500 కోళ్లు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. కోళ్లు చనిపోయిన ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఈనెల 16న 117, 17న 300, మిగతా కోళ్లు 18న చనిపోయాయని వెల్లడించారు. 19న శాంపిల్స్ సేకరించి పంపామన్నారు. 5,500 సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రీమియం ఫాంలో ఈ కోళ్లు చనిపోయాయని తెలిపారు.

News February 21, 2025

పాక్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత లేదు: అక్మల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచులో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఫైర్ అయ్యారు. ‘మా జట్టు ఐర్లాండ్, జింబాబ్వేతో సిరీస్‌లు ఆడుకోవడం బెటర్. అక్కడ గెలిచిన తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అర్హత ఉంటుంది. అప్పటివరకు మా టీమ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అర్హత లేదు. మా జట్టు ప్రమాణాలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. కివీస్‌ను చూసి నేర్చుకోవాలి’ అని ఆయన మండిపడ్డారు.

News February 21, 2025

MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని, ఇందులో పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు పాల్గొంటారని తెలిపాయి. రాష్ట్రంలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.

News February 21, 2025

విదేశీ శక్తులకు సహకరించిన ద్రోహుల్ని శిక్షించాల్సిందే: VP ధన్‌ఖడ్

image

భారత ప్రజాస్వామ్యాన్ని మకిలి పట్టించాలనుకున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. USAID నుంచి డబ్బులు తీసుకున్న ఇంటి దొంగలను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. మన అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే విదేశీ శక్తులను చాణక్య నీతితో నాశనం చేయాలని సూచించారు. సొంత దేశంలో ఇతరుల జోక్యానికి ఆస్కారమిచ్చిన వారిని హెచ్చరిస్తూ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు.