News April 17, 2024

‘శ్రీరామనవమి’ రోజున ఏం చేయాలి?

image

శ్రీరామనవమి రోజున సీతారాములతో పాటు ఆంజనేయుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. రాముడి తల్లిదండ్రులైన కౌసల్య, దశరథుడిని స్మరించుకోవడం మంచి ఫలితాలనిస్తుంది. దీంతో పాటు సీతారామ కల్యాణం జరిపించడం, ఆ వేడుకల్లో పాల్గొనడం, చూడటం మేలు చేస్తుంది. ఇక స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర పొంగలి, చెరకు, ఇప్పపూలు ప్రసాదంగా సమర్పించాలి.

News April 17, 2024

తారక మంత్రం విశిష్ఠత ఇదే..

image

‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే.. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ ఈ శ్లోకం చాలా విశిష్ఠమైనదని పండితులు చెబుతారు. ఇది విష్ణుసహస్ర నామంతో సమానమని అంటారు. మన పెదవులు రామ నామంలో ‘రా’ అనే అక్షరాన్ని ఉచ్చరించినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయని.. ‘మ’ అనే అక్షరాన్ని పలికినప్పుడు లోనికి రాకుండా మూసుకుంటాయని విశ్వసిస్తారు. ‘రామ’ నామాన్ని జపిస్తే పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

News April 17, 2024

సివిల్స్‌లో తెలంగాణ ఆడబిడ్డల హవా

image

సివిల్ సర్వీసెస్‌లో మరోసారి తెలంగాణ సత్తాచాటింది. 2022లో సూర్యాపేటకు జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఆమె 5వ ప్రయత్నంలో విజయం సాధించారు. అప్పుడు ఆమె తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా ఉన్నారు. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి కూతురు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంకు సాధించారు.

News April 17, 2024

నేడు కృష్ణాలో కూటమి ప్రచారం

image

ఎన్డీయే కూటమి ప్రచారం నేడు కృష్ణా జిల్లాకు చేరుకోనుంది. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు నేతలు పెడనకు చేరుకుంటారు. అక్కడి సభలో ప్రసంగం అనంతరం మచిలీపట్నం నియోజకవర్గానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడకు బయలుదేరతారు.

News April 17, 2024

గుజరాత్, ఢిల్లీ పోరులో నెగ్గెదెవరో?

image

ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచులు జరగ్గా.. గుజరాత్‌దే పైచేయిగా ఉంది. GT రెండింట్లో, ఢిల్లీ ఒక మ్యాచులో విజయం సాధించాయి. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో గుజరాత్ 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఢిల్లీ నాలుగు పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.

News April 17, 2024

కాంగ్రెస్ నేతపై ఈసీ నిషేధం

image

కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలాపై ఈసీ చర్యలకు దిగింది. బీజేపీ ఎంపీ హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో 48 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. అంతకుముందు ఆయన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించింది.

News April 17, 2024

ఇవాళ వైన్స్ బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా HYD జంటనగరాల్లో ఇవాళ వైన్ షాప్స్ మూసి ఉండనున్నాయి. జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. తిరిగి రేపు వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

News April 17, 2024

సివిల్స్ విజేతల్లో 60మంది తెలుగు తేజాలు

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష‌లో తెలుగు తేజాలు సత్తా చాటారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 60మందికి పైగా తెలుగు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మహబూబ్‌నగర్‌‌కు చెందిన అనన్యరెడ్డి 3వ ర్యాంకు సాధించారు. 100లోపు ర్యాంకుల్లో నలుగురు తెలుగువాళ్లున్నారు. 200లోపు మరో 11 మంది ర్యాంకులు సాధించారు. వీరంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం.

News April 17, 2024

సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర?

image

AP: కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్‌పై మరో దాడికి కుట్ర జరిగినట్లు YCP శ్రేణులు అనుమానిస్తున్నాయి. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర భగ్నమైనట్లు పేర్కొన్నాయి. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దాడి చేసేందుకు రాయితో వచ్చాడా? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News April 17, 2024

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

image

TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతల ఫిర్యాదుతో నోటీసులు పంపింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.