News June 24, 2024

రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం చేరుకోనున్న సీఎం, అక్కడ అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.

News June 24, 2024

100 రోజులుగా జైల్లోనే కవిత

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు అనేక ప్రయత్నాలు చేసినా.. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. పలుమార్లు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

News June 24, 2024

‘544’తో ఇదే చివరి లోక్‌సభ?

image

నేడు 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 544 మంది ఎంపీలతో కొలువుదీరిన ఈ సభ చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి అందుకు అనుగుణంగా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచే ఛాన్స్ ఉంది. సో, అప్పుడు కొత్త సంఖ్యతో సభ జరగాల్సి ఉంటుంది.

News June 24, 2024

వాలంటీర్లను ఉంచుతారా? తీసేస్తారా?

image

AP: వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా? లేక ఏమైనా మార్పులు చేస్తారా? అన్నదానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేడు జరిగే కేబినెట్ భేటీలో వాలంటీర్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థపై మంత్రి డీబీవీ స్వామి అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో లక్ష మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వైసీపీ నేతల ఒత్తిళ్లతోనే రాజీనామా చేశామని, తమను కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు

News June 24, 2024

NET దర్యాప్తు కోసం వెళ్లిన CBI బృందంపై దాడి

image

UGC-NET పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేసేందుకు బిహార్‌లోని ఓ గ్రామానికి వెళ్లిన సీబీఐ బృందంపై స్థానికులు దాడి చేశారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నలుగురు అధికారులు, ఓ మహిళా కానిస్టేబుల్‌తో కూడిన టీమ్ నవాడ్ సమీపంలోని కాసియాద్ గ్రామానికి వెళ్లింది. వాళ్లు నకిలీ అధికారులంటూ గ్రామస్థులు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. చివరకు లోకల్ పోలీసుల సాయంతో సీబీఐ అధికారులు బయటపడ్డారు.

News June 24, 2024

గురుకులాలన్నీ ఒకేచోట.. నమూనాలను పరిశీలించిన సీఎం

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌ నిర్మిస్తామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత కొడంగల్, మధిరలో 20-25 ఎకరాల్లో వీటిని నిర్మిస్తామన్నారు. నిన్న ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ CM పరిశీలించారు. గురుకులాలన్నీ ఒకే చోట నిర్మించడం ద్వారా కుల, మత వివక్ష తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News June 24, 2024

వారి రేషన్ కార్డులు, పెన్షన్లు కట్: మంత్రి

image

TG: అనర్హులు పొందుతున్న రేషన్ కార్డులు, పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.

News June 24, 2024

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె

image

TG: నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు (జూడా)నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ మినహా ఓపీ, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడా అసోసియేషన్ తెలిపింది. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం వంటి డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది.

News June 24, 2024

T20WC: ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునేనా?

image

T20 WC సూపర్-8లో భాగంగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. సెయింట్ లూసియాలోని డారెన్ సామీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కాగా గతేడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News June 24, 2024

నేడు ఏపీ కేబినెట్ తొలి భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, పింఛన్ల పెంపుపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రులు సమాలోచనలు చేయనున్నారు. అలాగే సూపర్-6 పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియపరిచేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు.