News December 25, 2024

నితీశ్‌ని తప్పిస్తారా.. అర్థరహితం: గవాస్కర్

image

మెల్‌బోర్న్‌లో రేపు జరిగే టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టు నుంచి తప్పిస్తారన్న వార్తలపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. ఆ నిర్ణయం పూర్తిగా అర్థరహితమని మండిపడ్డారు. ‘నితీశ్‌ను డ్రాప్ చేయలేం. అతడు జట్టుకు నాలుగో బౌలర్. మంచి బ్యాటర్ కూడా. అతడిని తప్పించకూడదు. అదే విధంగా గత మ్యాచ్‌లో ఫాలో ఆన్ గండం తప్పించిన ఆకాశ్ దీప్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కాల్సిందే’ అని తేల్చిచెప్పారు.

News December 25, 2024

తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు

image

సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.

News December 25, 2024

నితీశ్, నవీన్‌కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి

image

భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్‌, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

News December 25, 2024

రేపు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యే సినీ ప్రముఖులు వీరే!

image

TG: CM రేవంత్‌తో రేపు ఉ.10 గంటలకు సినీ ప్రముఖులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. వీరిలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్ కూడా ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, రాజనర్సింహ హాజరవుతారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని CM ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

News December 25, 2024

అరటి పండు తింటున్నారా?

image

అరటి, యాపిల్ తినే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో 3 నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అత్యవసర శక్తి అందిస్తాయని పేర్కొన్నారు.

News December 25, 2024

ఆడపిల్లలకు స్కూటీలు ఏవి రేవంత్?: కవిత

image

TG: రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ‘రైతులు పండించే పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతు భరోసా రాలేదు. క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల ఊసే లేదు. మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు’ ఆమె ఫైర్ అయ్యారు.

News December 25, 2024

వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD

image

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.

News December 25, 2024

జానీ మాస్టర్‌కు మరో షాక్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.

News December 25, 2024

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

News December 25, 2024

WhatsAppలో అదిరిపోయే ఫీచర్

image

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే ఇక థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. బ్లాక్&వైట్ మోడ్, PDF లాంటి ఆప్షన్లు ఉంటాయి.