News December 23, 2024

ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ

image

భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.

News December 23, 2024

PV సింధు పెళ్లి(PHOTO)

image

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. తన చిరకాల మిత్రుడు వెంకట దత్తసాయి మూడుముళ్లు వేశారు. సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన జంట ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది.

News December 23, 2024

నేను చెబితే చంద్రబాబు చెప్పినట్లే: ఆదోని MLA

image

AP: ఆదోని నియోజకవర్గంలో గత పదేళ్లు సర్వం తామే అని వ్యవహరించిన వైసీపీ కార్యకర్తలకు 5 నెలల సమయం ఇచ్చామని, ఇక చాలని MLA పార్థసారథి అన్నారు. ఆదోనిలో లబ్ధి చేకూరే ఏ ఒక్క పనిలోనూ వైసీపీ కార్యకర్త ఉండటానికి వీల్లేదన్నారు. తాను చెబితే చంద్రబాబు, పవన్ చెప్పినట్లేనని, మర్యాదగా వదిలిపోండని హెచ్చరించారు. తమను ఆపే శక్తి ఈ రాష్ట్రంలో రాబోయే 25 ఏళ్ల వరకు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.

News December 23, 2024

సంభల్: ఆ మెట్లబావి, సొరంగానికి ‘సిపాయిల తిరుగుబాటు’తో అనుబంధం

image

UP సంభల్ ఆక్రమణల తొలగింపుతో మన గత చరిత్ర వెలుగుచూస్తోంది. తాజాగా బయటపడ్డ సొరంగం, మెట్లబావి 150 ఏళ్ల క్రితానివని భావిస్తున్నారు. 1857లో బ్రిటిషర్లపై సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వాతంత్ర్య సమరంగా చెప్తారు. అప్పటి సిపాయిలకిది ఎస్కేప్ రూట్‌గా ఉపయోగపడిందని సమాచారం. ఆదివారం ASI టీమ్ సంభల్‌లో 5 పవిత్ర స్థలాలు, 19 బావులను సర్వే చేసింది. తవ్వేకొద్దీ ఇక్కడ మరింత చరిత్ర బయటపడొచ్చని అధికారులు అంటున్నారు.

News December 23, 2024

శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలి: VH

image

TG: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రశ్నించారు. తెలంగాణలో లా&ఆర్డర్ అదుపు తప్పకూడదని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారని, దీనిపై అల్లు అర్జున్ ఆలోచించాలని సూచించారు. శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. BJP, BRSలు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని, ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని కోరారు.

News December 23, 2024

వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి

image

TG: త్వరలో రీజినల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి’ అని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.

News December 23, 2024

ఇక్కడ స్థిరపడ్డాక ఏపీకి ఎందుకెళ్తాం?: నాగవంశీ

image

టాలీవుడ్ APకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాను డబ్బు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నానని, తనలా స్థిరపడిన వారు తిరిగి APలో ఏం చేస్తారని ప్రశ్నించారు. షూటింగుల్లో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు కానీ తెల్లవారుజామున గం.4:30కి సినిమా పడితే చాలని మీడియాకు తెలిపారు. FDC ఛైర్మన్ దిల్ రాజుకు తమ విజ్ఞప్తులు అందిస్తామన్నారు.

News December 23, 2024

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్ల నియామకం భేష్: గుత్తా జ్వాలా

image

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్‌జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం కానుంది’ అని పేర్కొన్నారు.

News December 23, 2024

రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన

image

AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్‌ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News December 23, 2024

800 మందికి ఓ వైద్యుడున్నాడు!

image

ఇండియాలో వైద్యుల సంఖ్య, వారికి ఎదురయ్యే సమస్యలపై ఓ వైద్యుడు చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రస్తుతం ఆధునిక వైద్యం చదివిన వైద్యులు 13 లక్షలు, ఆయుష్ వైద్యులు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే పని ఒత్తిడితో వైద్యులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల కంటే పదేళ్ల ముందే చనిపోతున్నారు. జూ.డాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని Xలో రాసుకొచ్చారు.