News April 2, 2024

ఔరా.. మూడేళ్లలో 15 ప్రభుత్వ ఉద్యోగాలు!

image

TG: సూర్యాపేట(D) నేరేడుచర్లకు చెందిన మధుసూదన్ 15 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. B.Tech పూర్తి చేసిన ఇతను మూడేళ్ల వ్యవధిలో పలు బ్యాంకుల్లో క్లరికల్, PO, మేనేజర్ వంటి హోదాల్లో 15 కొలువులు సాధించారు. నిన్న విడుదలైన IBPS ఫలితాల్లోనూ PO క్యాడర్ ఉద్యోగాన్ని ఒడిసిపట్టారు. అయితే పోస్టు కేటాయించిన ప్రదేశం, ఇతర కారణాలతో ఏ జాబ్‌లోనూ చేరలేదట. నిత్య సాధనతో SSCలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.

News April 2, 2024

పతంజలిపై సుప్రీంకోర్టు ఫైర్

image

కోర్టు ధిక్కరణపై పతంజలి సంస్థ క్షమాపణలు చెప్పిన తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే కోర్టు వ్యవహారాల గురించి తెలిసే ఉల్లంఘించినట్లు అనిపిస్తోంది. అల్లోపతిపై పతంజలి దుష్ప్రచారం చేస్తుంటే కేంద్రం స్పందించకపోవడం ఆశ్చర్యకరం’ అని విమర్శించింది. వివరణ ఇచ్చేందుకు పతంజలికి మరో ఛాన్స్ ఇస్తూ విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

News April 2, 2024

కట్నంలో ‘ఫార్చునర్’ లేదని కొట్టి చంపాడు..

image

UPలోని నోయిడాలో ఘోరం జరిగింది. కరిష్మాకు వికాస్‌తో 2022లో పెళ్లయింది. అప్పుడు రూ.11లక్షల బంగారం, ఓ SUV కారు కట్నం ఇచ్చారు. అవి చాలవని భావించిన వికాస్ అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఓ కూతురు పుట్టాక వేధింపులు రెట్టింపయ్యాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ.10లక్షలిచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. ఫార్చునర్ కారు, రూ.21లక్షల నగదు ఇవ్వాలని ఆమెను కొట్టి చంపాడు. కేసు నమోదైంది.

News April 2, 2024

AAPకు మరో షాక్.. వాఘేలా మృతి

image

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ‌కి మరో షాక్ తగిలింది. AAP వ్యవస్థాపక సభ్యుడు దినేశ్ వాఘేలా(73) మృతి చెందారు. బాబాజీగా ప్రసిద్ధి చెందిన వాఘేలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే సోమవారం రాత్రి పనాజీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుజరాత్‌కు చెందిన ఆయన ఆప్ క్రమశిక్షణా కమిటీకి నేతృత్వం వహించారు. గోవాలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

News April 2, 2024

సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు?: సునీత

image

AP: వివేకాను ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్న CM జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు. ‘నా తండ్రి హత్యను రాజకీయంగా జగన్ వాడుకున్నారు. 5 ఏళ్లు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు. MP అవినాశ్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని CMకు భయమా? ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఈ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటకొస్తేనే రాష్ట్రాభివృద్ధి’ అని తెలిపారు.

News April 2, 2024

ఇంటికి పేరును మారిస్తే సొంతమైపోతుందా?: జైశంకర్

image

అరుణాచల్ ప్రదేశ్‌లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే, ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కాపలా ఉంది’ అని గుర్తుచేశారు.

News April 2, 2024

బీఆర్ఎస్ రైతుల పక్షమే: హరీశ్ రావు

image

TG: కేసీఆర్ పొలం బాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షమేనని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ప్రభుత్వ నేతలకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News April 2, 2024

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలి: బండి

image

TG: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టిన ఆయన.. ‘రైతులను ఆదుకోవాలి. కర్షకులు లేనిదే రాజ్యం లేదు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పంట ఎండిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి’ అని కోరారు.

News April 2, 2024

BIG BREAKING: స్కూళ్లకు వేసవి సెలవులు

image

AP: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినమని వెల్లడించింది.

News April 2, 2024

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన KTR

image

TG: తనపై వస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ ఆరోపణలపై KTR స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తనపై నిరాధార వార్త రాసిన పత్రికపైనా ఫిర్యాదు చేస్తానన్నారు.