News April 1, 2024

‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ ఎంతంటే?

image

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.68.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద టిల్లన్న డామినేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా ఈ మూవీ వచ్చింది.

News April 1, 2024

ఇంటికే వెళ్లి పింఛన్లు ఇవ్వాలి: సీఎస్‌కు టీడీపీ వినతి

image

AP: వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించినందున లబ్ధిదారులకు పెన్షన్లను ఇంటి వద్దే అందించే ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి టీడీపీ నేతలు వినతి పత్రం అందించారు. పెన్షన్ల పంపిణీని ఈ నెల 5లోగా పూర్తి చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

News April 1, 2024

జనసేనలో చేరిన మాజీ MLA మండలి బుద్ధప్రసాద్

image

AP: అవనిగడ్డ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ ఈయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవనిగడ్డ నుంచి మండలి టీడీపీ సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా దీన్ని జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేయనున్నారు. ఈయన 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు.

News April 1, 2024

ధోనీ ధనాధన్.. పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్

image

నిన్నటి ఢిల్లీ, చెన్నై మ్యాచ్‌లో ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. CSK ఓడినా మునపటి ధోనీని చూశాం, అది చాలు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ పదేళ్ల క్రితం చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఏ జట్టు గెలుస్తుందనేది అనవసరం, నేను ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికే ఉన్నా’ అని 2014, మార్చి 24న ట్వీట్ చేశారు. అన్నట్టుగానే ధోనీ ఎంటర్‌టైన్ చేశారంటూ ఫ్యాన్స్ ఆ పాత పోస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

News April 1, 2024

టీడీపీకి షాక్.. రెబల్‌గా మీసాల గీత పోటీ

image

AP: విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మీసాల గీత రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి టికెట్‌ను అదితి గజపతిరాజుకు ఇవ్వడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి విజయనగరం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

News April 1, 2024

BREAKING: విచారణ వాయిదా

image

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మార్చి 15న అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

News April 1, 2024

భారత్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీలంక

image

టెస్టుల్లో శ్రీలంక అరుదైన రికార్డు నెలకొల్పింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 531 పరుగులు చేసింది. ఇందులో ఆరుగురు ప్లేయర్లు అర్ధసెంచరీలు చేయగా.. ఏ ఒక్కరూ సెంచరీ చేయకపోవడం గమనార్హం. 1976లో న్యూజిలాండ్‌పై భారత్ ఇదే తరహాలో 524 పరుగులు చేసింది. తాజాగా శ్రీలంక ఆ రికార్డును అధిగమించి భారీ స్కోరు సాధించింది.

News April 1, 2024

తిహార్ జైలులో సెల్ కేటాయింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తిహార్ జైలులో అధికారులు సెల్ కేటాయించారు. జైలు నంబర్ 2 కాంప్లెక్స్‌లో ఆయనకు సెల్ కేటాయించగా.. అందులో కేజ్రీవాల్ ఒక్కరే ఉండనున్నారు. ఇదివరకు ఈ సెల్‌లో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కొద్ది రోజుల క్రితం జైలు నంబర్ 5 కాంప్లెక్స్‌కి మార్చారు. ఇదే కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మహిళా ఖైదీలు ఉండే జైలు నంబర్ 6 కాంప్లెక్స్‌లో ఉంచారు.

News April 1, 2024

భోజ్‌శాల సర్వేపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు

image

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజ్‌‌శాల/కమల్ మౌలా మసీదుపై జరుగుతున్న శాస్త్రీయ సర్వేపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సర్వే ఫలితాలు వెల్లడయ్యాక తమ అనుమతి లేనిదే ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పురావస్తు శాఖ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ ప్రదేశంలో మంగళవారం హిందువులు, శుక్రవారం ముస్లిములు ప్రార్థనలు చేస్తారు.

News April 1, 2024

ఏఐతో మానవాళి అంతానికి 20శాతం ఛాన్స్: మస్క్

image

ఏఐతో మానవాళి పూర్తిగా అంతమయ్యేందుకు 20శాతం వరకు ఛాన్స్ ఉందని టెస్లా వ్యవస్థాపకుడు మస్క్ అభిప్రాయపడ్డారు. ‘దానితో ఉన్న ఉపయోగాల దృష్ట్యా ఆమాత్రం రిస్క్ తీసుకోవడం తప్పదు. ఏఐను అభివృద్ధి చేయడమంటే పిల్లాడిని పెంచినట్లే. ఆ పెంపకం ఎలా ఉంటుందన్నదానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ నిజమే చెప్పేలా శిక్షణనివ్వడం కీలకం. ఒకసారి అబద్ధాలు మొదలుపెడితే, దానికి అంతు ఉండదు’ అని హెచ్చరించారు.