News August 14, 2024

ఎలాన్ మస్క్, జేకే రౌలింగ్‌పైనా ఖెలీఫ్ కేసు

image

అల్జీరియా వివాదాస్పద బాక్సర్ ఖెలీఫ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం తనను నెట్టింట విమర్శించిన వారందరిపై ఆమె ఫ్రాన్స్‌లో దావా వేశారు. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ‘హ్యారీపోటర్’ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా ఉన్నారు. ఇటలీ బాక్సర్ ఓడిపోయిన సమయంలో ఖెలీఫ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మస్క్ మద్దతునిచ్చారు. అటు రౌలింగ్ సైతం ఖెలీఫ్ మగాడంటూ ట్వీట్ వేశారు.

News August 14, 2024

గనుల రాష్ట్రాలకు ఘన విజయం.. రాయల్టీ వసూలుకు సుప్రీం అనుమతి

image

మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ బకాయిలను రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2005 ఏప్రిల్ 1 తర్వాత బకాయిలను 12 ఏళ్ల వ్యవధిలో వసూలు చేసుకోవాలని, చెల్లింపులపై జరిమానాలు విధించొద్దని ఆదేశించింది. PSUలపై రూ.70వేల కోట్లు, ప్రజలపై భారం పడుతుందని దీనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది. గనుల భూమిపై రాయల్టీ అధికారం రాష్ట్రాలదేనని జులై 25న సుప్రీం కోర్టు 8:1 తేడాతో తీర్పునిచ్చింది.

News August 14, 2024

భార్యతో విమానంలో సామాన్యుడిగా YS జగన్(PHOTO)

image

AP: మాజీ సీఎం YS జగన్ సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విజయవాడ-బెంగళూరు మధ్య మాజీ సీఎం ఎక్కువగా ప్రయాణిస్తుండగా ఆ సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.

News August 14, 2024

రేపటి నుంచి ఆరోగ్య శ్రీ బంద్: ఆస్పత్రులు

image

AP: పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.

News August 14, 2024

రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం

image

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా ఏజెన్సీల అధిపతులతో నార్త్ బ్లాక్‌లో భేటీ అయ్యారు. ఇటీవల జమ్మూలో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో భద్రత కట్టుదిట్టం చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News August 14, 2024

అయోధ్యలో రూ.50లక్షల విలువైన లైట్లు చోరీ!

image

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సర్కారు సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు చోరీ చేశారు. వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్టు పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

News August 14, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

image

TG: గవర్నర్ కోటా MLCల నియామకంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగా MLCలను నియమించకుండా స్టే విధించాలన్న BRS నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వేసిన పిటిషన్లను తిరస్కరించింది. కొత్త MLCల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లే అవుతుందని విచారణ సందర్భంగా జస్టిస్ విక్రంనాథ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News August 14, 2024

‘ధరణి’లో ఆపరేటర్లుగా వారికి ఛాన్స్?

image

TG: ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన వారిని పోటీ పరీక్షల ద్వారా నియమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం నిఘా ఉంచింది. ప్రస్తుతం పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా? వద్దా? అనేది త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

News August 14, 2024

జగన్&కో దురాగతాలకు పాల్పడుతున్నారు: లోకేశ్

image

AP: కర్నూలు(D) హోసూరులో జరిగిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు <<13847578>>హత్యను<<>> మంత్రి లోకేశ్ ఖండించారు. ‘ఎన్నికల్లో TDP తరఫున పనిచేశాడనే కక్షతో YCP మూకలు శ్రీనివాసులును హతమార్చాయి. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్&కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. శ్రీనివాసులు కుటుంబానికి అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News August 14, 2024

టెట్ రాసిన వారికి ALERT

image

TG: టెట్ రాసిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసి ఉంటే సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఇందుకోసం ఈనెల 20వ తేదీ సా.5 గంటలలోపు helpdesktsdsc2024@gmail.comకు ఈ-మెయిల్ పంపాలని తెలిపింది. అలాగే డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈనెల 20 సా.5గంటల వరకు <>https://schooledu.telangana.gov.in<<>> వెబ్‌సైట్‌కు పంపొచ్చని పేర్కొంది.