News March 27, 2024

BREAKING: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

image

AP: ఏప్రిల్, మే నెలల పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్ప్ కీలక ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని.. ఫొటోలు, వీడియోలు తీయొద్దని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ స్పష్టం చేసింది.

News March 27, 2024

రాష్ట్రంలో భానుడి భగభగలు

image

TG: రాష్ట్రంలో ఇవాళ ఎండలు దంచికొట్టాయి. భానుడి భగభగతో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎండల తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News March 27, 2024

కాంగ్రెస్ సీఈసీ భేటీ ప్రారంభం

image

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ సీఈసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఇందులో చర్చించనున్నారు. భేటీ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.

News March 27, 2024

మహారాష్ట్రలో ఇండియా కూటమిలో చిచ్చు!

image

NDAను పడగొట్టడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సీట్ల పంపకం తలనొప్పిగా మారింది. తాజాగా మహారాష్ట్రలో శివసేన (UBT), కాంగ్రెస్ మధ్య రచ్చ మొదలైంది. శివసేన 17 స్థానాల అభ్యర్థులను ప్రకటించుకోవడమే ఇందుకు కారణం. 48 స్థానాల్లో తాము 22 చోట్ల పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా శివసేన నడుచుకుంటోందని విమర్శిస్తున్నారు.

News March 27, 2024

రేపే పోలింగ్

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక రేపు జరగనుంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ZPTC, MPTC సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ల(14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు)తో కలిపి 1,439 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన CM రేవంత్ కూడా ఓటు వేయనున్నారు. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

News March 27, 2024

డబ్బు కట్టలపై నిద్రించిన రాజకీయ నేత

image

అస్సాంకు చెందిన ఓ రాజకీయ నేత డబ్బుల కట్టలపై నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోడోలాండ్‌కు చెందిన నేత బెంజామిన్ బసుమతారీ పలు పథకాల్లో అవినీతికి పాల్పడి.. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన కరెన్సీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 27, 2024

EVM గురించి మీకివి తెలుసా?

image

ఎన్నికలప్పుడు తరచూ EVM అనే మాట వినిపిస్తుంది. EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్. ఓటర్లు వేసిన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసి లెక్కిస్తుంది. ఓట్లు వేసే సమయంతో పాటు లెక్కింపు సమయాన్ని కూడా తగ్గిస్తుంది. హైసెక్యూరిటీ ఫీచర్లతో తయారు చేయడంతో వీటిని హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇవి విద్యుత్‌పై ఆధారపడకుండానే పని చేస్తాయి. వేసిన ఓటును మాత్రమే నమోదు చేస్తాయి.

News March 27, 2024

పాము రక్తం తాగుతున్న మహిళలు.. ఎందుకంటే?

image

అందంగా కనిపించేందుకు కొందరికి పండ్ల రసాలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండోనేషియా రాజధాని జకార్తాలో అందం కోసం కోబ్రా రక్తాన్ని తాగేస్తారు. చర్మం నిగారింపు కోసం మహిళలు, ఆరోగ్యం కోసమని పురుషులు ఈ బ్లడ్ లాగించేస్తారట. అందుకే నగర వీధుల్లో సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 1 వరకు వీటి అమ్మకాలు జరుపుతారు. విక్రయదారులు రోజుకు రూ.10లక్షలు సంపాదిస్తారంటే అర్థం చేసుకోవచ్చు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో.

News March 27, 2024

మ్యాచ్‌కు సిద్ధం: కమిన్స్

image

కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో త్రుటిలో గెలుపును చేజార్చుకొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై బోణీ చేయాలన్న కసితో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ‘రెండో మ్యాచ్‌కు సిద్ధం’ అంటూ ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. ముంబై, హైదరాబాద్ జట్లు ఈ సీజన్‌లో తొలి విజయం కోసం పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయి.

News March 27, 2024

రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు

image

కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఇండిగో విమానాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్లేన్ ఢీకొట్టింది. దీంతో రెండు విమానాల ఒకవైపు రెక్కలు విరిగిపోయాయి. వందలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. రెండు విమానాల పైలట్లను DGCA విచారిస్తోంది.