EastGodavari

News August 23, 2024

తూ.గో జిల్లా అడిషనల్ ఎస్పీగా వెంకట సుబ్బరాజు

image

తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా అల్లూరి వెంకట సుబ్బరాజు గురువారం రాజమండ్రిలో బాధ్యత స్వీకరించారు. 1989 బ్యాచ్ కు చెందిన అల్లూరి వెంకట సుబ్బరాజు గతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చిత్తూరు జిల్లాలో విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) గా నియమితులయ్యారు.

News August 23, 2024

జవాబుదారీ తనానికి గ్రామాలే నిదర్శనం: తూ.గో కలెక్టర్

image

గ్రామ సభలను విజయవంతం చేసేందుకు ప్రజలను, ఉద్యోగులను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తూ.గో కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి గ్రామసభల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారులతో రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీల పరిధిలో సభలను నిర్వహించాలని, ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.

News August 22, 2024

కాకినాడ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

image

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవలలో గురువారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పటవల రాఘవేంద్రపురం సమీపంలో యానాం వైపు వెళ్తున్న బైక్‌ను కాకినాడ వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజులూరు మండలం జగన్నాథగిరికి చెందిన మణికంఠ(31) అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామంలో పైడా కళాశాల సమీపంలో ఓ వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

News August 22, 2024

కోనసీమ జిల్లాలో CM రేపటి పర్యటన షెడ్యూల్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని పల్లాలమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సభ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన వివరాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో బయలుదేరి హెలికాప్టర్‌ ద్వారా 11:40కి వానపల్లి చేరుతారు. 11:50 నుంచి 1:30 వరకు సభ.. అనంతరం 2:20కి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో HYD వెళ్తారని తెలిపారు.

News August 22, 2024

తూ.గో.: పిడుగులు పడే ఛాన్స్

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే పరిస్థితి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణం ప్రభావంతో పిడుగులు పడే పరిస్థితి ఉన్నందున ప్రజలు, ప్రయాణికులు, రైతులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఫోన్లకు సంక్షిప్త సందేశాలను పంపించింది.

News August 22, 2024

అనకాపల్లిలో ప్రమాదం.. కాకినాడ జిల్లా వాసి విషాద గాథ ఇదీ

image

అనకాపల్లిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో సామర్లకోటకు చెందిన నాగబాబు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా 6 నెలల క్రితమే తండ్రి మృతిచెందాడు. తల్లి, సోదరులకు తానున్నానని ధైర్యం చెప్పి ఉద్యోగానికి వెళ్లాడు. ఇప్పుడు అతని మృతితో కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భార్య సాయితో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. విశాఖలోనే ఉంటూ ఎసెన్షియా కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

News August 22, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి 2.86 లక్షల క్యూసెక్కుల జలాలు

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం 2.86 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి  విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 14, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.60 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని వివరించారు.

News August 22, 2024

తూ.గో.: అసభ్యకర ప్రవర్తన.. టీచర్ సస్పెండ్

image

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేసినట్లు సమిశ్రగూడెం SI రమేశ్ తెలిపారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం జడ్పీ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగమణి రాజు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కొందరు అతనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు విచారణ చేసి సస్పెండ్ చేశారు. HM లలితారమణి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు.

News August 22, 2024

రేపు కాకినాడలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

image

కాకినాడలో గురువారం ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 10:00కు కాకినాడ కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు వివిధ కళారూపాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పాల్గొంటారని తెలిపారు.

News August 22, 2024

ఈనెల 24న కాకినాడలో జాబ్ మేళా

image

ఈనెల 24న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.