Guntur

News May 17, 2024

గుంటూరు: ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

image

జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ANUలో ఓట్లు లెక్కించనున్నారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్‌కు టేబుళ్లు, బారికేడ్లు, CC కెమెరాలు తదితర సౌకర్యాలను ROలు పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. రౌండ్ల వారీగా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందజేయాలని స్పష్టం చేశారు.

News May 17, 2024

పల్నాడు అల్లర్లు.. మరికొందరిపై వేటు

image

పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు జిల్లా SPని సస్పెండ్ చేయగా.. కలెక్టర్‌ను బదిలీ చేశారు. గురజాల డీఎస్పీ ఎ.పల్లపురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు, బాల నాగిరెడ్డి‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్సైలు.. ఎం.రామాంజనేయులు, డీవీ కొండారెడ్డిలపై కూడా సస్పెండ్ వేటు వేశారు.

News May 16, 2024

పల్నాడులో దాడులు.. కలెక్టర్, ఎస్పీపై వేటు

image

పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సీఈసీ అధికారిక ప్రకటన చేసింది. సీఎస్, డీజీపీల నుంచి తీసుకున్న వివరణ తర్వాత పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌ను సస్పెండ్ చేసి, కలెక్టర్ శివశంకర్‌ను బదిలీ చేసింది. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ రోజు, ముగిసిన తర్వాత పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.

News May 16, 2024

బాపట్ల జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది: రాజశేఖర్

image

బాపట్ల జిల్లాలో కూటమి ఏడు నియోజకవర్గాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు చెప్పారు. గురువారం బాపట్ల పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల అభ్యర్థులు విజయంలో జనసేన శ్రేణులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరిగిన దాడి విషయాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

News May 16, 2024

చిలకలూరిపేట: కళ్ల ముందే తల్లిదండ్రులు సజీవ దహనం

image

చిలకలూరిపేట మం. పసుమర్రు బస్సు ప్రమాద ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో కాశీ బ్రహ్మేశ్వరరావు(64), ఆయన భార్య లక్షీ(55), మనవరాలు ఖ్యాతి శ్రీసాయి(9) ఉన్నారు. బ్రహ్మేశ్వరరావు దంపతులకు భావన, పూజిత కుమార్తెలు. పూజిత కుమార్తె అయిన ఖ్యాతి, భావన, దంపతులు బస్సులో ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో భావన కిటికీలోంచి దూకి ప్రాణాలతో బయటపడగా.. ఆమె కళ్ల ముందే కన్నవాళ్లు, సోదరి కుమార్తె సజీవ దహనమయ్యారు.

News May 16, 2024

పిన్నెల్లిలో బాంబులు బయటపడినా.. ఎందుకు మౌనం?: యరపతినేని

image

వైసీపీ నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మారుస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులను నియంత్రించడంలో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. మాచవరం మం. పిన్నెల్లిలో భారీగా బాంబులు బయటపడినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే, అరాచకవాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 16, 2024

నా వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారు: జంగా

image

ఎమ్మెల్సీ పదవి విషయంలో వివరణ తీసుకోకుండానే మండలి ఛైర్మన్ తనను అనర్హుడిగా ప్రకటించినట్లు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. గురువారం గుంటూరులో గృహనిర్బంధంలో ఉన్న జంగా మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందినవాడిని కావడం వల్లనే తనపై వివక్ష చూపుతున్నారని జంగా ఆవేదన వ్యక్తం చేశారు

News May 16, 2024

చిలకలూరిపేట: మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

image

చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, గాయపడిన 30 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 20 మంది చినగంజాం వాసులే.

News May 16, 2024

జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనాలు

image

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కాగా గురువారంతో ఈ మహాయాగం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో జగన్‌కు వేదపండితులు తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

News May 16, 2024

చిలకలూరిపేట: ఆరుగురి మృతికి కారణమిదే.?

image

చిలకలూరిపేట మం. పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. చినగంజాం నుంచి HYD బయల్దేరిన బస్సును క్లీనర్ షరీఫ్ నడిపాడని, వాస్తవానికి బస్సు యజమాని అంజి నడపాల్సి ఉందని తెలిసింది. ఈ ఘటనలో షరీఫ్ కూడా మృతిచెందాడు. ఇతనితో పాటు బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.