Kurnool

News July 16, 2024

శ్రీశైలం ఈవోగా IAS అధికారి.?

image

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.

News July 16, 2024

కర్నూలు ఎస్పీ ప్రస్థానం

image

కర్నూలు జిల్లా ఎస్పీగా జీ.బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన బిందుమాధవ్ 2017 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. SVPNPAలో శిక్షణ తర్వాత మొదట ప్రకాశం జిల్లా గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం రంపచోడవరం ఏఎస్పీగా, గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్‌గా, పల్నాడు అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత గ్రేహౌండ్స్ ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పని చేశారు.

News July 16, 2024

వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటా: ఎస్పీ

image

100 రోజుల కార్యచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అంతకుముందు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.

News July 16, 2024

నంద్యాల: ఊటీ కాదు మన “నల్లమల” అడవే

image

నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో అల్లుకుపోయిన పచ్చటి దట్టమైన చెట్లతో నల్లమల అడవి అబ్బురపరుస్తుంది. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచు దుప్పటి నల్లమలను కప్పేసింది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలను తలపించేలా పొగ మంచు అందాలు ప్రయాణికులు, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. నంద్యాల నుంచి విజయవాడకు బస్సు, రైలు మార్గం ద్వారా ప్రయాణించే వారు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు.

News July 16, 2024

కర్నూలు జిల్లాలో 1145 ఎకరాల భూమి ఆక్రమణ: సీఎం

image

వైసీపీ పాలనలో ‘సహజవనరుల దోపిడి’పై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 1.75లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 1145 ఎకరాలు పేదలకు చెందిన భూమిని 856మంది వైసీపీ నేతలు రాయించేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు రూ.300కోట్ల భూమిని 33ఏళ్లు లీజుకు తీసుకున్నారని వెల్లడించారు.

News July 16, 2024

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్

image

నంద్యాలలోని డా.వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి వినతులను స్వీకరించారు. అర్జీలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు అలసత్వం వహించరాదని కలెక్టర్ హెచ్చరించారు. జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News July 15, 2024

కర్నూలు జిల్లాలో 72 పోస్టల్ ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్‌లో 37, నంద్యాల డివిజన్‌లో 35 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

ఉపాధి వేతన వృద్ధిరేటు పెంచండి: కలెక్టర్

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సగటు దినసరి కూలీ రూ.300 కూలీ మొత్తానికి చేరుకునేలా పనులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలు, సంబంధిత ఏపీడీలను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.250 వేతనాన్ని అధిగమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News July 15, 2024

సమస్యల పరిష్కారం కోసం 161 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 161 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News July 15, 2024

FLASH: కర్నూలు ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు

image

కర్నూలు నూతన ఎస్పీగా జీ.బిందు మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన ఏఆర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.