Nellore

News September 28, 2024

నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’

image

వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.

News September 28, 2024

నెల్లూరు: వచ్చే నెల 3 నుంచి టెట్ పరీక్ష

image

ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. ఏదో ఒక ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

News September 27, 2024

పార్లమెంట్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా వేమిరెడ్డి

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక పదవిని దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల అయింది. పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల జాబితాలో వేమిరెడ్డి పేరు ఉండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 27, 2024

World Tourism Day: మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, విశాలంగా సముద్ర తీరం, పెంచలకోన, రంగనాథస్వామి దేవాలయం, ఉదయగిరి కోట, సోమశిల డ్యాం ప్రాజెక్ట్, దేశానికే తలమానికంగా నిలిచే శ్రీహరి కోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ చూపరులను కట్టి పడేస్తుంది. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

News September 27, 2024

నెల్లూరు మార్కెట్లో కాక పుట్టిస్తున్న కొబ్బరి ధరలు

image

నెల్లూరు మార్కెట్లో కొబ్బరి ధరలు సామాన్యులకు కాక పుట్టిస్తున్నాయి. కొబ్బరి, కొబ్బరికాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. కొబ్బరికాయ రూ.25 నుంచి రూ.40కి పెరిగింది. కొద్ది రోజుల్లో రూ.70కు చేరుతుందని వ్యాపారులు తెలిపారు. ఎండు కొబ్బరి కిలో రూ.130 ఉండగా తాజాగా రూ.200 దాటింది. కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు కారణంగానే ధరలు పెరిగినట్లు పలువురు తెలిపారు.

News September 27, 2024

నెల్లూరు హైవేపై ప్రమాదం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనకే వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 27, 2024

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24 వరకు ఆంక్షలు

image

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చినట్లు నాయుడుపేట DSP చెంచు బాబు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 27, 2024

ఫిబ్రవరి నాటికి జాతీయ రహదారులు పూర్తి చేయాలి

image

జాతీయ రహదారులకు సంబంధించిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో గురువారం శంకరన్ హాల్లో కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని జాతీయ రహదారుల పనులను వేగవంతం చేసి ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారికి పలు సూచనలు చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, ఎన్ హెచ్ పీడీ చౌదరి, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

News September 26, 2024

ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

image

మాజీ MP మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ హాజరై నివాళులర్పించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు బ్యాండ్‌తో గాల్లోకి 3రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో MLAలు సోమిరెడ్డి, దామచర్ల జనార్ధన్, నేతలు, పెద్దఎత్తున మాగుంట అభిమానులు పాల్గొన్నారు.

News September 26, 2024

నాయుడుపేటలో గంజాయి కలకలం

image

నాయుడుపేట పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతానికి చెందిన వంతల వెంకట్రావును పట్టుకున్నట్లు సీఐ బాబి వెల్లడించారు. అతని బ్యాగులో నాలుగు కేజీల గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే విషయాలపై విచారిస్తున్నట్లు తెలిపారు.