Vizianagaram

News June 20, 2024

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్

image

ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్ గురువారం మంగళగిరిలో మధ్యతరహా పరిశ్రమ, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనవంతుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

News June 20, 2024

జగన్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం: MLC

image

జగన్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చి పాఠశాలలను నాశనం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయని, ఉపాధ్యాయులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆకాక్షించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 117 జీవోను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.

News June 20, 2024

గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

విజయనగరం జిల్లాలో గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది పక్కాగా విధులు నిర్వహించాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. గంజాయితో ఎవరైనా పట్టుబడితే.. కేసులు పెట్టి వదిలేయకుండా మూలాల్లోకి వెళ్ళాలని సూచించారు. వారికి ఎక్కడి నుంచి సరుకు వచ్చింది? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వారి వెనుక ఉన్నదెవరు? కొనుగోలుదారులు వారితో సంబంధాలు ఉన్నవారు తదితర వివరాలు సేకరించాలన్నారు.

News June 20, 2024

VZM: 40 శాతం రాయితీతో వేరుశెనగ విత్తనాలు

image

ఉమ్మడి జిల్లాకు 1132 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ గుర్తించింది. 40 శాతం రాయితీతో రైతులకు అందించనున్నారు. విజయనగరం జిల్లాకు కె-6 రకం 600 క్వింటాళ్లు, మన్యంకు 188 క్వింటాళ్లు, గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై 10 క్వింటాళ్లు కేటాయించారు. లేపాక్షి రకం 300, 18, 16 క్వింటాళ్ల చొప్పున ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటికే 433 క్వింటాళ్ల సరకు మండల కేంద్రాలకు చేరింది.

News June 19, 2024

విజయనగరం: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం  

image

రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్ఐ రవివర్మ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం అందిన సమాచారం మేరకు గజపతినగరం సమీపంలో పట్టాలపై వున్న మృతదేహాన్ని పరిశీలించామన్నారు. రైలు నుంచి జారీ పడటంతో వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని ఎస్ఐ తెలిపారు.  సమాచారం తెలిసిన వారు విజయనగరం, బొబ్బిలి జీఆర్పీ స్టేషనుకు తెలపాలని కోరారు.

News June 19, 2024

అశోక్ గజపతిరాజుతో రామ్మోహన్ నాయుడు భేటీ

image

కేంద్ర మాజీమంత్రి పి.అశోక్ గజపతి రాజును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఉన్న అశోక్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మంచి మంత్రిత్వ శాఖ ఇచ్చారని బాగా పనిచేసి పేరు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడును కోరారు. విమానయాన రంగంపై అశోక్ తన అనుభవాలను వివరించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా అశోక్‌ను కలిశారు.

News June 19, 2024

24 నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ఈనెల 24 నుంచి సమస్యలపై వినతులు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

News June 19, 2024

VZM: మాజీ సీఎం జగన్‌తో జిల్లా నేతల భేటీ

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి‌తో వైసీపీ జిల్లా నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

News June 18, 2024

సాలూరు: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

సాలూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. టౌన్ సీఐ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీ థియేటర్, చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని మంగళవారం సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు వెళ్లి పరిశీలించామన్నారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోయిందని సీఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్సై సీతారం చెప్పారు.

News June 18, 2024

గంజాయి రవాణా నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్: డీసీపీ సత్తిబాబు

image

హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.