news

News August 16, 2024

మీ విజయాలతో దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ

image

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రతిభను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మన ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని ఆయన కొనియాడారు. భారత అథ్లెట్లతో ఢిల్లీ వేదికగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పతకాలు సాధించిన వారిని సత్కరించారు. పారిస్ ఒలింపిక్స్‌తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

News August 16, 2024

‘డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్’కు షాకింగ్ కలెక్షన్లు!

image

పూరీ జగన్నాథ్-రామ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్, హరీశ్ డైరెక్షన్‌లో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలకు తొలిరోజు అంతంతమాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇస్మార్ట్‌ ₹6.3 కోట్లు నెట్(గ్రాస్ ₹1.1 కోట్లు), బచ్చన్‌ ₹4.5 కోట్లు నెట్(గ్రాస్ ₹95 లక్షలు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం వరకు వరుస సెలవులు ఉండటంతో కలెక్షన్లు పెరగొచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

News August 16, 2024

స్కిల్ వర్సిటీకి ఛైర్మన్ నియామకం.. త్వరలో అడ్మిషన్స్

image

TG: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఛైర్మన్‌గా ఆనంద్ నియామకం పూర్తి కావడంతో యూనివర్సిటీ పరిపాలన, తరగతుల ప్రారంభం ప్రక్రియలో వేగం పుంజుకోనుంది. ఈనెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో పాఠ్యప్రణాళిక సిద్ధం కానుంది.

News August 16, 2024

మీ అబ్బాయిలకు ఇది చెబుతున్నారా?

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈక్రమంలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మీ కూతురికి నేర్పిస్తున్నారు. అలాగే మీ కుమారుడికి కూడా దాని గురించి తెలిసి ఉండాలి’ అని రాసి ఉన్న ప్లకార్డు ఆలోచింపజేస్తోంది. పరాయి అమ్మాయిల పట్ల ఎలా వ్యవహరించాలనే జ్ఞానం ఉన్నప్పుడే ఇలాంటి దారుణాలు కాస్తయినా తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

News August 16, 2024

ఇస్రో ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోటలోని షార్‌ నుంచి దూసుకెళ్లిన SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈవోఎస్-08ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఉదయం 9.17 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా, 4 దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగించి భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా 16.57 నిమిషాల్లో ప్రయోగం ముగిసింది. దీంతో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేశారు.

News August 16, 2024

EOS-08 శాటిలైట్ ప్రయోగం ఎందుకంటే?

image

SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. దీని బరువు 175KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు. సముద్రాలపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, అగ్నిపర్వత పేలుళ్లు, పారిశ్రామిక విపత్తులు, వరదలను గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ మిషన్ ఏడాదిపాటు సేవలందిస్తుంది.

News August 16, 2024

KTRపై ఫైర్.. ‘ఫ్రీ బస్‌’పై మీ అభిప్రాయమేంటి?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న మహిళలకు ఫ్రీ బస్‌పై KTR చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహిళలను KTR కించపరిచారంటూ నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఈ ‘ఫ్రీ బస్’ ఆడవాళ్లకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తోందని కొందరంటే, బస్సులో సీట్లే దొరకట్లేదని ఇంకొందరంటున్నారు. ఈ ఫ్రీ బస్‌ స్కీమ్‌పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News August 16, 2024

5 నెలలకే పుట్టి, స్కూల్ హాజరులో వరల్డ్ రికార్డ్

image

AP: పల్నాడు(D) సత్తెనపల్లి వాసి మస్తాన్‌, షీబా(కేరళ) దంపతులకు ఐదో నెలలోనే బాలిక అయత్‌ జన్మించింది. కేవలం 500 గ్రాముల బరువు ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చకపోవడంతో ప్రత్యేక వైద్య పరికరాల సాయంతో బిడ్డను కాపాడుకున్నారు. ప్రస్తుతం బాలిక కేరళలో LKG చదువుతోంది. 2023-24లో 197 రోజులు తరగతులు నిర్వహించగా అన్ని రోజులూ హాజరైంది. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 4 రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

News August 16, 2024

ఒకే రోజు 4 రిలీజ్‌లు.. మీకు ఏ సినిమా నచ్చింది?

image

నిన్న ఒకే రోజు 4 కొత్త సినిమాలు రిలీజవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. హరీశ్ డైరెక్షన్‌లో రవితేజ-భాగ్యశ్రీ జంటగా ‘మిస్టర్ బచ్చన్’, పూరీ-రామ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే పా.రంజిత్ డైరెక్షన్‌లో విక్రమ్ నటించిన ‘తంగలాన్’, నార్నె నితిన్ హీరోగా ‘ఆయ్’ మూవీలు సందడి చేస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో రూపొందిన ఈ సినిమాల్లో మీకు ఏది నచ్చింది? కామెంట్ చేయండి.

News August 16, 2024

ట్రైనీ డాక్టర్ హత్యాచారం: CBI దర్యాప్తు షురూ

image

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో CBI దర్యాప్తు ఆరంభించింది. పలువురు వైద్యులు, నర్సులు, మిత్రుల నుంచి CBI అధికారులు కీలక వివరాలు సేకరించారు. కుమార్తె మరణం గురించి సమాచారం ఎప్పుడిచ్చారో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. RG‌కర్ ఆస్పత్రిలో మృతురాలికి ఎవరితోనైనా విభేదాలున్నాయా అని ఆమె మిత్రురాలిని ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న అనుమానితుడి కాల్ రికార్డులు, మొబైల్లో హత్యను చిత్రీకరించారేమో పరిశీలించారు.