news

News December 22, 2024

రోహిత్‌కు గాయం!

image

టీమ్ ఇండియాకు నెట్ సెషన్లలో వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓపెనర్ రాహుల్ చేతికి గాయం కాగా తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఎంసీజీ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో ఆయన నొప్పితో పక్కన కూర్చుండిపోయారు. అయితే మ్యాచ్ జరిగేందుకు ఇంకా 4 రోజులున్న నేపథ్యంలో ఆటగాళ్లు కోలుకుంటారని టీమ్ ఇండియా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

News December 22, 2024

ఈ ఏడాది అత్యంత లాభాలు చూసిన సినిమా ఏదంటే..

image

ఈ ఏడాది అత్యధిక శాతం లాభాలు పొందిన తెలుగు సినిమా ఏది? పుష్ప-2 సినిమా ఇప్పటికే రూ.1500 కోట్ల మార్కును దాటేసినా తొలి స్థానంలో ఉన్నది ఆ మూవీ కాదు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి వరల్డ్ వైడ్ రూ.350 కోట్ల వరకూ వసూలు చేసిన హనుమాన్ మూవీ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమాకు 650 శాతం నుంచి 775 శాతం మేర లాభాలు వచ్చినట్లు అంచనా.

News December 22, 2024

తీవ్ర వరదలు.. కటిక కరవు

image

గ్లోబల్ వార్మింగ్ కారణంగా రానున్న సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాలు తీవ్ర వరద, మరికొన్ని తీవ్రమైన కరవును ఎదుర్కోనున్నాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ, CSTEP అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరదలు, 91 జిల్లాలు తీవ్ర కరవు కేటగిరీలో ఉన్నాయంది. ఏపీలోని కృష్ణా, ప.గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు కరవు సమస్య పొంచిఉన్నట్లు తేలింది.

News December 22, 2024

ప్ర‌శ్నార్థ‌కంగా MVA మ‌నుగ‌డ!

image

మ‌హారాష్ట్ర‌లో విప‌క్ష మ‌హా వికాస్ అఘాడీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల వల్ల సొంత బలం కోల్పోయామన్న భావనలో 3 పార్టీలున్నాయి. ముఖ్యంగా శివ‌సేన UBT ముంబై న‌గ‌రంలో త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయింది. దీంతో పున‌ర్వైభ‌వం కోసం కూట‌మికి దూరం జ‌రుగుతోంది. 2025లో జ‌ర‌గ‌నున్న బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది.

News December 22, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు

image

AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు రేపటి నుంచి ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు రూ.25 ఫైన్‌తో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు.

News December 22, 2024

పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

image

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.

News December 22, 2024

ఇవి అత్యంత ఖరీదైన చీరలు

image

చీరలు స్త్రీల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంటాయి. అందుకే భారత మహిళలు చీర కట్టును ఇష్టపడుతుంటారు. చీరల్లో లెక్కలేనన్ని రకాలున్నా వాటిలో అత్యంత ఖరీదైనవి మాత్రం కొన్నేే. అవి.. మూంగా పట్టుచీర: ధర రూ.2 లక్షల వరకు ఉంటుంది. పటాన్ పటోలా చీర: రూ.లక్ష వరకూ ఉంటుంది. కడ్వా కట్‌వర్క్ చీర: రూ.5 లక్షల వరకూ ధర ఉంటుంది. కాంచీపురం పట్టుచీర: ధర రూ.5 లక్షల వరకూ ఉంటుంది. బనారస్ పట్టుచీర: రూ.5 లక్షల వరకూ ఉంటుంది.

News December 22, 2024

FEB 28 వరకు పీసీ ఘోష్ కమిషన్ గడువు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణకు నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం నాలుగోసారి పొడిగించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు అవకాశమిచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సమస్యలు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

News December 22, 2024

రాష్ట్రానికి తప్పిన ముప్పు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు IMD వెల్లడించింది. దీంతో రాష్ట్రానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్లేనని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 55Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

News December 22, 2024

లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్.!

image

లోన్‌ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా, భౌతికంగా లేదా ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా ముసాయిదాను సర్కారు రూపొందించింది. ఇది అమలైతే బంధువులకు ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్‌లు అప్పులు ఇవ్వడం ఇక కుదరదు.