news

News August 6, 2024

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.870 తగ్గి రూ.69,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.800 తగ్గి రూ.63,900గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీపై ఏకంగా రూ.3,200 తగ్గి రూ.82,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 6, 2024

బయల్దేరిన హసీనా విమానం.. ఆమె అందులో ఉన్నారా? లేదా?

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇండియాకు తీసుకొచ్చిన C-130J Hercules ఎయిర్‌క్రాఫ్ట్ హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరింది. అందులో హసీనా ఉన్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ రాలేదు. ఒకవేళ మాజీ ప్రధాని అందులో ఉంటే ఆ ఫ్లైట్ యూకే లేదా యూఏఈకి వెళ్లే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. నిన్న ఢాకా నుంచి బయల్దేరిన ఆ విమానం ఘజియాబాద్ (యూపీ)లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయింది.

News August 6, 2024

అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అవుతారు: మాజీ కోచ్

image

టీమ్‌ఇండియా ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ప్రశంసలు కురిపించారు. అతనిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. వన్డేల్లో అదరగొడుతున్న గిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అతను రోహిత్ వద్ద పాఠాలు నేర్చుకుంటున్నాడని అన్నారు. 2027 వన్డే WC తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా గిల్ ఎంపికవుతారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

News August 6, 2024

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు?

image

AP: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై తన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2024లో ఆయనకు టికెట్ నిరాకరించిన వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థిగా వంగా గీతను నిలబెట్టిన విషయం తెలిసిందే.

News August 6, 2024

PMగా ఆఖరి నిమిషాల్లో హసీనా ఏం చేశారంటే..

image

అల్లరి మూకలు చుట్టుముడుతున్న సమయంలో PMగా చివరి నిమిషాల్లో షేక్ హసీనా ఏం చేశారు? ఆమె సన్నిహిత వర్గాల ప్రకారం.. వెంటనే బయలుదేరాలని మధ్యాహ్నం 1.30కి భద్రతా సిబ్బంది హసీనాకు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలన్న ఆమె కోరికను తోసిపుచ్చారు. 1.45 PMకి ప్లానింగ్ కమిషన్ భవనానికి, అక్కడి నుంచి పాత తేజ్‌గావోన్ ఎయిర్‌పోర్టుకు సోదరితో సహా హసీనాను తరలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో భారత్‌కు పంపించారు.

News August 6, 2024

రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది: కేటీఆర్

image

TG: 2022-23లో 1,27,594 ఐటీ ఉద్యోగాలు సృష్టించగా, 2023-24లో ఆ సంఖ్య 40,285కు పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. ఇదే టైమ్‌లో ఐటీ ఎగుమతుల విలువ ₹57,706cr నుంచి ₹26,948crకు పడిపోయిందని ట్వీట్ చేశారు. BRS హయాంలో ఐటీ సెక్టార్ మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు.

News August 6, 2024

కొడుకు చనిపోయాడని తెలియని తల్లి.. విషాదంలో కుటుంబం

image

MS చదివేందుకు US వెళ్లిన తన కొడుకు చనిపోయాడని ఆ తల్లికి తెలియదు. తెలిస్తే బాధపడుతుందని కుటుంబసభ్యులు చెప్పలేదు. సిద్దిపేట(D) కూటిగల్‌కు చెందిన సాయిరోహిత్(23) గతనెల 22న రూమ్ నుంచి బయటకు వెళ్లాడు. 24న ఓ సరస్సులో శవమై తేలాడు. అతని మృతిపై అనుమానాలు ఉన్నాయి. మృతదేహం నేడు ఇంటికి చేరుకోనుంది. ₹30L అప్పుచేసి కొడుకును విదేశాలకు పంపిన పేరెంట్స్‌కు కన్నీళ్లే మిగిలాయని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

News August 6, 2024

బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్న కవిత

image

ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను MLC కవిత వెనక్కి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి CBI కేసులో ఆమె బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నిన్న సీనియర్ న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు లాయర్ కోరారు. పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు.

News August 6, 2024

పుట్టుక మీది.. చావు మీది.. బతుకంతా తెలంగాణది: కేటీఆర్

image

ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోశారని KTR ట్వీట్ చేశారు. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ‘పుట్టుక మీది, చావు మీది.. బతుకంతా తెలంగాణది. ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది. ఆయన అడుగు జాడల్లోనే తెలంగాణ పోరాటం. తెలంగాణ ప్రగతి ప్రస్థానం’ అని పేర్కొన్నారు.

News August 6, 2024

బంగ్లా మ‌రో పాకిస్థాన్ అవుతుంది: హ‌సీనా కుమారుడు

image

బంగ్లాదేశ్ మ‌రో పాకిస్థాన్ అవుతుంద‌ని ఆ దేశ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా కుమారుడు సాజీబ్ వాజిద్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశాభివృద్ధికి త‌న త‌ల్లి ఎంత కృషి చేసినా ఇప్పుడు బంగ్లా పాకిస్థాన్‌లా మారుతోందన్నారు. అంత‌ర్జాతీయ స‌మాజం త‌న త‌ల్లిని విమ‌ర్శించ‌డంలో బిజీగా ఉంద‌ని త‌ప్పుబ‌ట్టారు. గ‌త 15 ఏళ్లలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా బంగ్లా స్థిర‌త్వాన్ని చవిచూసిందని వివరించారు.