news

News December 9, 2024

ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చింది ఈరోజే!

image

ట్రాఫిక్ రూల్స్‌లో ఎంతో ముఖ్యమైన సిగ్నల్ లైట్స్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది ఈరోజే. డిసెంబర్ 9, 1868న ప్రపంచంలో తొలిసారిగా లండన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ గ్యాస్ ల్యాంప్స్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నెలరోజుల్లోనే పేలుడు సంభవించడంతో ఈ ప్రయోగానికి ముగింపు పలికారు.

News December 9, 2024

జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్

image

AP: సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చని నటి తరఫు లాయర్లు వాదించగా కోర్టు తోసిపుచ్చింది.

News December 9, 2024

ఏడాదికి రూ.2కోట్ల జీతం

image

TG: వికారాబాద్(D) బొంరాస్‌పేట(M) తుంకిమెట్లకు చెందిన సయ్యద్ అర్బాజ్ ఖురేషి జాక్‌పాట్ కొట్టారు. 2019లో IIT పట్నాలో బీటెక్ పూర్తి చేసిన ఇతను 2023లో AI, మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు. MSలో చూపిన ప్రతిభ ఆధారంగా దిగ్గజ సంస్థ అమెజాన్ అమెరికాలో అప్లైడ్ సైంటిస్టుగా రూ.2కోట్ల వార్షిక వేతనానికి ఎంపిక చేసింది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఖురేషి యువతకు సూర్ఫినివ్వాలని అతని తండ్రి ఆకాంక్షించారు.

News December 9, 2024

కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి

image

సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.

News December 9, 2024

చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురు

image

TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మన్ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొంది.

News December 9, 2024

మంచు మనోజ్ కడుపు, వెన్నెముకకు గాయాలు

image

మంచు మనోజ్ శరీరంపై గాయాలున్నట్లు మెడికో లీగల్ రిపోర్టులో వెల్లడైంది. కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లున్నాయని తేలింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో మనోజ్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి భార్యతో కలిసి వచ్చిన ఆయన చికిత్స అనంతరం వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టు ఇవాళ బయటకు వచ్చింది.

News December 9, 2024

ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న రేవంత్: హరీశ్ రావు

image

TG: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి దుర్మార్గ, అరాచక పాలన సాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై కుట్రతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని ఆరోపించారు. ఆమె విగ్రహాన్ని మార్చాలని ఎవరైనా ఉద్యమాలు చేశారా? అని ప్రశ్నించారు.

News December 9, 2024

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చింది ఈరోజే

image

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 2009లో సరిగ్గా ఇదే రోజు కేంద్రం నుంచి తొలి ప్రకటన వెలువడింది. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన 11 రోజుల తర్వాత ఈ ప్రకటన రావడంతో బీఆర్ఎస్ ఈరోజును ఏటా ‘దీక్షా విజయ్ దివస్’‌గా నిర్వహిస్తోంది. ప్రజల పోరాటాన్ని చూసి చలించి ఈ ప్రకటన చేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. 2013 OCT3న కేంద్ర క్యాబినెట్ TG స్టేట్ ఏర్పాటుకు ఆమోదం తెలపగా, 2014 జూన్ 2న రాష్ట్రం అవతరించింది.

News December 9, 2024

కేరళలో BJP కొత్త గేమ్ ప్లాన్!

image

పదేళ్లలో కేరళలో పాగా వేయడానికి BJP ఒక స్ట్రాటజీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 54, ముస్లిములు 27, క్రైస్తవులు 18% ఉన్నారు. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలవుతూ LDFను వీడుతున్న హిందూ, క్రైస్తవులను BJP చేరదీస్తోంది. క్రైస్తవ మత పెద్దలతో సమావేశమవుతూ మద్దతు సంపాదిస్తోంది. తాజాగా జార్జ్ జాకబ్ కూవకడ్ కార్డినల్ వేడుకకు ఓ బృందాన్ని వాటికన్‌కు పంపించింది.

News December 9, 2024

బాలిక నోట్లో దుస్తులు కుక్కి, పెట్రోల్ పోసి..

image

AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని <<14828564>>హతమార్చిన<<>> ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న దుర్మార్గుడు ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడు. నిద్రిస్తున్న బాలిక నోట్లో దుస్తులు కుక్కి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడే మృతి చెందింది. అతడు కూడా నిప్పటించుకోగా, పరిస్థితి విషమంగా ఉంది.