news

News March 25, 2024

ఈ రాష్ట్రాల్లోనే రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువ!

image

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ICMR అధ్యయనంలో వెల్లడైంది. వచ్చే ఏడాది దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పరిశోధకులు తెలిపారు. పట్టణాల్లో ఉండే మహిళలతో పోలిస్తే గ్రామాల్లో ఉండేవారికి ఈ ముప్పు తక్కువని తెలిపారు. ఊబకాయం, లేటు వయసులో వివాహాలు, ఆలస్యంగా పిల్లల్ని కనడం, పిల్లలకి సరిపడా పాలు ఇవ్వకపోవడం వంటివి క్యాన్సర్ ఉద్ధృతికి కారణాలని పేర్కొన్నారు.

News March 25, 2024

కొత్త నిబంధనలను తీసుకొచ్చిన IRDAI

image

ఇన్సూరెన్స్ పాలసీల్లో సరెండర్ వాల్యూకు సంబంధించి IRDAI కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం మూడేళ్లలోపు పాలసీలను సరెండర్ చేస్తే వాటి విలువ యథాతథంగా లేదా తక్కువగా ఉంటుంది. 4-7 ఏళ్లలోపు సరెండర్ చేస్తే స్వల్పంగా పెరుగుతుంది. మెచ్యూరిటీ డేట్ కంటే ముందే పాలసీని ముగిస్తే కంపెనీలు పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని సరెండర్ వాల్యూగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

News March 25, 2024

ఎంపీగా మాజీ సీఎం

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నారు. బీజేపీలో ఉన్న ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ వచ్చింది. చాలా రోజుల క్రితమే ఆయన కమలం పార్టీలో చేరినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయలేదు. మరి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మాజీ సీఎం ఎంపీగా గెలుస్తారో లేదో చూడాలి.

News March 25, 2024

‘శివ శక్తి’ పేరుకు ఆమోదం

image

జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ ప్రకటించిన ‘శివ శక్తి’ పేరును అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. గతేడాది ఆగస్టు 23న ప్రధాని ఆ పేరును ప్రకటించగా దాదాపు 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. ప్రకృతి పురుషుడు (శివుడు), స్త్రీ (శక్తి) అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుంచి సేకరించిన పదమే ‘శివ శక్తి’ అని గెజిటరీ ఆఫ్‌ ప్లానెటరీ నోమెన్‌క్లేచర్‌ వివరించింది.

News March 25, 2024

సీమలో రెండు చోట్లే..

image

AP: వచ్చే ఎన్నికల్లో జనసేన 21 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో సింహభాగం సీట్లు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఉన్నాయి. రాయలసీమలో తిరుపతి, రైల్వే కోడూరు స్థానాల్లోనే బరిలోకి దిగుతోంది. 2009లో తిరుపతిలో చిరంజీవి నెగ్గారు. 2019లో జనసేన నేత చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లే పోలయ్యాయి. రైల్వేకోడూరులో గతంలో PRP అభ్యర్థికి 22వేల చిలుకు ఓట్లు రాగా.. 2019లో జనసేన క్యాండెట్‌కు 9,964 ఓట్లే వచ్చాయి.

News March 25, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలయ్యేది అప్పుడేనా?

image

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. మే నెలలో విడుదల కావాల్సి ఉండగా, ఎన్నికల దృష్ట్యా జూన్‌లో రిలీజ్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించినట్లు సమాచారం. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి జరగనుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

News March 25, 2024

పెరిగిన చికెన్ ధరలు

image

TG: వారం క్రితం తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం HYDలో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.240 నుంచి రూ.260 వరకు అమ్ముతున్నారు. 7 రోజుల క్రితం రూ.210 పలికింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.50 వరకు ఎగబాకింది. మరి మీ ప్రాంతంలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి.

News March 25, 2024

గంటాకే భీమిలి.. త్వరలో ప్రకటన?

image

భీమిలి టికెట్‌ చివరికి గంటా శ్రీనివాసరావుకే దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. వీరిలో గంటాకే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు ఫీడ్‌బ్యాక్ వచ్చిందని టీడీపీ వర్గాలంటున్నాయి. దీంతో ఆఖరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప.. నేడో రేపో భీమిలి టికెట్‌ను గంటాకు ప్రకటించడం లాంఛనమేనని అంతర్గత వర్గాల సమాచారం.

News March 25, 2024

ఘోరం.. ట్రక్కుతో తొక్కించి ఐదుగురిని చంపేశారు

image

రాజస్థాన్‌లోని ఝలావర్‌లో దారుణం జరిగింది. ఓ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బైకులపై వెళ్తుండగా ప్రత్యర్థులు ట్రక్కుతో తొక్కించేశారు. దీంతో ఇద్దరు సోదరులు భరత్ సింగ్(22), ధీరజ్ సింగ్(20) సహా ఐదుగురు ట్రక్కు టైర్ల కింద నలిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.

News March 25, 2024

హోలీ వెనుక శాస్త్రీయ కారణమిదే..

image

వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీంతో వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు వస్తాయి. ఈ సమయంలోనే హోలీ జరుపుకుంటారు. కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన సహజ రంగులు కలిపిన నీరు చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని ఓ నమ్మకం. మోదుగ పూలు, ఎర్ర మందారం, పసుపు, గోరింటాకుతో రంగులు చేసుకుని వాడుకోవచ్చు. అయితే మార్కెట్లోని రసాయన రంగుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

error: Content is protected !!