India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ADB జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారి చేసింది. ఎన్నికల అధికారిగా జిల్లా సహకార అధికారి, జాయింట్ రిజిస్టర్ మోహన్‌ను నియమించారు. మొత్తం 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనుండగా… ఈనెల 12న నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ జరగనుంది. 17న పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ బుధవారం సందర్శించారు. ఈ పాఠశాలలో ఉదయం విద్యార్థినుల భోజనంలో పురుగులు ఉన్నాయని ఆరోపణలు రాగా ఆయన ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయనతో పాటు విద్యాధికారి పవార్ అనిత, తహశీల్దార్ రాజలింగం తదితరులు ఉన్నారు.

ఇంద్రవెళ్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ధన్నుర బి వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఒక బైక్‌పై గుడిహత్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బైక్‌పై ఉట్నూర్ మండలం ఉమ్రి తాండ్రకు చెందిన ఒక కుటుంబం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎండోన్మెంట్ భూములు, భూ భారతిలో నమోదైన సాదాబైనామాలు, అసైన్డ్ ల్యాండ్ దరఖాస్తులపై గూగుల్ మీట్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, భూపరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూ భారతి అప్లికేషన్లో నమోదవుతున్న సాదా బైనామాలు, వాటి పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఖాళీగా ఉన్న తెలుగు అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ డా.జె.సంగీత పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 11వ తేదీ గురువారం కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలని పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఓటు వేసేందుకు తెలంగాణ బీజేపీ ఎంపీలతో కలిసి ఎంపీ గోడం నగేశ్ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వేశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేశ్ సెల్ఫీ తీశారు.

జిల్లాలో అందరి సహకారంతోనే గణేష్ నిమజ్జన ఉత్సవాలు శాంతియుతంగా పూర్తి చేసినట్లు ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. నిమజ్జననోత్సవం శాంతియుతంగా పూర్తైన సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు జిల్లా ఎస్పీని మంగళవారం కలిసి శాలువతో సత్కరించారు. సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, పడకంటి సూర్యకాంత్, రవీందర్, కందుల రవీందర్, రాజు, మహిపాల్ తదితరులు ఉన్నారు.

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా పాల్గొని కాళోజీ నారాయణరావు చిత్రాటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ స్రవంతి, జిల్లా అధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.