Nalgonda

News October 10, 2025

NLG: ఎంపీటీసీ స్థానాలకు 2 నామినేషన్లు దాఖలు

image

స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ, దేవరకొండ డివిజన్ల పరిధిలోని 18 జడ్పీటీసీ, 196 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసి, అధికారులు నామినేషన్లను స్వీకరించారు. దీంతో కనగల్ మండలం జీ ఎడవల్లి ఎంపీటీసీ స్థానానికి ఒకరు, NKP మండలం NKP-1 ఎంపీటీసీ స్థానానికి మరొకరు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

News October 10, 2025

నేడు నల్గొండ జిల్లా బంద్

image

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లా బంద్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. బంద్‌కు అన్ని వ్యాపార, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు సహకరించాలని కోరారు.

News October 10, 2025

MLG: కుక్కల స్వైర విహారం.. ఆరుగురికి తీవ్రగాయాలు

image

మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో పిచ్చికుక్కల దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులు, నలుగురు పెద్ద వారిపై కుక్కలు దాడి చేశాయని గ్రామస్థులు తెలిపారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, ఇంటి నుంచి బయట కాలు పెట్టే పరిస్థితి లేదని వారు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

News October 10, 2025

NLG: అన్ని పాఠశాలల్లో ఆడిట్: కలెక్టర్

image

విద్యార్థుల భద్రత దృష్ట్యా త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గత నెల 4న DVK రోడ్‌లో ఉన్న మాస్టర్ మైండ్స్ పాఠశాలలో బస్సు కిందపడి మృతి చెందిన చిన్నారి జశ్విత కేసు విషయం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో నోటీసులు జారీచేసి పాఠశాలను తాత్కాలికంగా మాత్రమే సీజ్ చేశామన్నారు.

News October 10, 2025

NLG: బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ

image

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ ఏ.అనిత తెలిపారు. 8వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన జనరల్ మహిళలు, ఒంటరి మహిళలు, స్కూల్ మద్యలో ఆపేసిన మహిళలు, డిజేబుల్ మహిళలు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News October 9, 2025

NLG: ఇలా చేస్తే.. ఆఫ్రికన్ నత్తలు ఖతం!

image

ఆఫ్రికా నత్తల నివారణకు కిలో ఉప్పును 4 లీటర్ల నీటిలో కలిపి ఆ నీటిలో గోనె సంచిని తడిపి గట్లపై వేస్తే ఈ సంచులపైకి వెళ్లిన నత్తలు ద్రావణం ఘాటుకు చనిపోతాయని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సుభాషిని తెలిపారు. ఆకర్షక ఎర ఏర్పాటులో భాగంగా 10 కిలోల వరి తవుడుకు, కిలో బెల్లం, లీటర్ ఆముదం, కిలో ధయోడికార్స్ గుళికలు(ఎసిఫెట్/ క్లోరోఫైరిఫాస్) కలిపి చిన్న ఉండలుగా చేసి బొప్పాయి,క్యాబేజీ ఆకుల కింద పెట్టాలన్నారు.

News October 9, 2025

NLG: 13 రోజులకు 50 దరఖాస్తులు

image

జిల్లాలోని మద్యం దుకాణాలకు బుధవారం వరకు 50 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 దుకాణాలు ఉండగా.. ఇప్పటివరకు 50 దరఖాస్తులు అందాయని తెలిపారు. కాగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తున్నా వ్యాపారులు అనాసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News October 9, 2025

నల్గొండ: ALLERT.. వాట్సాప్ గ్రూప్‌ల హైజాకింగ్

image

జిల్లా పరిధిలో వాట్సాప్ గ్రూప్‌ల హైజాకింగ్ జరుగుతున్నట్లు అత్యవసర సమాచారం అందింది. +91 98480 50204 నంబర్‌ను ఉపయోగించి గ్రూప్ అడ్మిన్‌లను తొలగించి, ఆ గ్రూప్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నల్గొండలో 20కి పైగా గ్రూపులు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. తమ గ్రూప్‌లలో ఎక్కడైనా పై నంబర్ కనిపిస్తే, వెంటనే దాన్ని గ్రూప్ నుంచి తొలగించి, గ్రూప్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

News October 9, 2025

NLG: ఎన్నికలకు నిధుల సమస్య.. ప్రత్యేక గ్రాంట్‌పై సందిగ్ధం

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిధుల సమస్య ఎదురైంది. ఎన్నికల ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటు ఇంకా విడుదల కాలేదని తెలిసింది. హైకోర్టు ఎన్నికలకు సంబంధించి స్పందించినా అధికారుల్లో సందిగ్ధం నెలకొంది. జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ సామగ్రి రవాణా ఖర్చులకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.

News October 9, 2025

NLG: పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడి

image

ఇప్పటికే చీడపీడల నివారణకు అష్టకష్టాలు పడుతున్న రైతులకు తాజాగా ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తల దాడి తలనొప్పిగా మారింది. జిల్లాలో పలుచోట్ల ఈ నత్తల దాడిలో పంటలు, ఉద్యానవన తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో ఆఫ్రికన్ నత్తలు పంటలపై దాడులు చేస్తున్నాయని అక్కడి రైతులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు.