Nalgonda

News March 26, 2026

నాగార్జునసాగర్: క్యాంటీన్ లేక టూరిస్టుల అవస్థలు

image

విజయవిహార్ వద్ద కనీస క్యాంటీన్ సౌకర్యం లేకపోవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తాగునీరు, తినుబండారాలు దొరకక ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత పర్యాటక శాఖ అధికారులు స్పందించి, వెంటనే అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 26, 2026

NLG: వానాకాలం సాగుకు ‘కార్యాచరణ’ సిద్ధం!

image

రాబోయే వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, ఎరువుల అవసరం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన అధికారులు, ఈసారి రికార్డు స్థాయి సాగును అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. సింహభాగం వరి, పత్తి పంటలదే కావడం విశేషం.

News March 26, 2026

NLG: ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకనం

image

పదో తరగతి పరీక్షల నిర్వహణలో వేగం పెంచిన విద్యాశాఖ, అదే వేగంతో జవాబు పత్రాల మూల్యాంకనానికి కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 28వ తేదీ నుంచే జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్ణీత కేంద్రాల్లో మూల్యాంకనం కొనసాగనుంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రధాన కేంద్రాలను ఇప్పటికే పరీక్షల విభాగం సిద్ధం చేసినట్లు సమాచారం.

News March 26, 2026

నల్గొండ: సాయుధ పోరాట యోధుడికి నివాళి!

image

ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు దిగ్గజం బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి నేడు. విద్యార్థి దశలోనే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆయన, బ్రహ్మచారిగా ప్రజాసేవకే అంకితమయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఎన్నికై వెనుకబడిన వర్గాల, గీత కార్మికుల హక్కుల కోసం నిలబడ్డారు. సామాన్య జీవితం గడిపిన ఆయన ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నేతలు కొనియాడారు.

News March 26, 2026

నల్గొండ: ఇంధన కొరతపై ఎస్పీ స్పష్టత

image

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 25, 2026

నల్గొండ జిల్లాలో ఇంధనానికి ఢోకా లేదు: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. బుధవారం పౌరసరఫరాల అధికారులు, డీలర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెంది, ఒకేసారి భారీగా నిల్వలు కొనుగోలు చేయవద్దని కోరారు.

News March 25, 2026

NG కళాశాల పాత విద్యార్థులకు ‘గోల్డెన్ ఛాన్స్’

image

NG కళాశాల పాత (2011-12 నుండి 2022-23) విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తీపి కబురు అందించింది. వివిధ కారణాల వల్ల డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థుల కోసం జూన్/జులై 2026లో ప్రత్యేక బ్యాక్‌లాగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.మునిస్వామి ప్రకటించారు. ఏప్రిల్ 4వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు.

News March 25, 2026

లక్ష్యాలను పూర్తి చేయండి.. బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ప్రభుత్వ ప్రాధాన్య పథకాల గ్రౌండింగ్‌ లక్ష్యాలను తక్షణమే పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్‌ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణ రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 25, 2026

నల్గొండ: ఎస్సీ కార్పొరేషన్ పథకాల గడువు పెంపు

image

నల్గొండ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద వివిధ స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకాల్లో ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంపు సెట్లు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు.

News March 25, 2026

పాత తాలూకా.. నిడమనూరును నియోజకవర్గంగా మార్చాలి

image

నియోజకవర్గాల పునర్విభజన సెగ ఉమ్మడి నల్గొండలో మొదలైంది. కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న ప్రచారంతో, పాత తాలూకా కేంద్రమైన నిడమనూరును నూతన నియోజకవర్గంగా ప్రకటించాలని స్థానిక యువత, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరుతో పాటు అడవిదేవులపల్లి, త్రిపురారం, మాడుగులపల్లి మండలాలు.. కొత్తగా ప్రతిపాదిత తుమ్మడం, ఎర్రబెల్లి మండలాలను కలిపి అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.