Nizamabad

News March 10, 2025

NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

image

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.

News March 10, 2025

సిరికొండ: వడ్డీ వ్యాపారుల వేధింపులకు యువకుడి బలి

image

సిరికొండ మండలం ముషిరునగర్‌కు చెందిన మనోహర్ నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడకు చెందిన జ్యోతి వద్ద ఆరు నెలల క్రితం రూ.40వేలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.80వేలు చెల్లించాలని మనోహర్‌పై కొద్దికాలంగా జ్యోతి మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్ళారు. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 10, 2025

నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

image

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.

News March 10, 2025

వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

image

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్‌ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు. 

News March 10, 2025

NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం..

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగనుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు అర్జీలు సమర్పించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు.

News March 10, 2025

నిజామాబాద్ జిల్లాకు రూ.600 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.

News March 10, 2025

NZB: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఉర్దూ అకాడమీ ఛైర్మన్

image

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ నిజామాబాద్ అర్వింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్థల సేకరణ చేపట్టలేదన్నారు. కేవలం ప్రతిపాదనలు మాత్రమే వెళ్లాయని అప్పుడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదన్నారు.

News March 10, 2025

NZB: విద్యార్థిని చితికబాదిన హాస్టల్ వార్డెన్

image

NZBలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వాహజుద్దీన్‌ను చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ నిఖిల్ అనే వార్డెన్ కొట్టడంతో గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరి ప్రిన్సిపల్ హనుమంతరావుకు అడగగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదన్నారు. తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News March 9, 2025

NZB: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

image

ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ(62) ఒక షోరూంలో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేసి ఇంటికి బైక్‌పై వెళుతుండగా త్రిమూర్తి ఎదురుగా మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.

News March 9, 2025

NZB: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో మెరిగే కవిత(43) అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. ఆమె కుమారుడు పూల వ్యాపారం చేసి నష్టపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. కుమారుడు నష్టపోయిన విషయంలో కవిత మనస్తాపానికి గురైందన్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు.